Reading Time: 2 minutes
India Uk Fta July 15 Tariff Free Access Indian Exports Britain

భారత్-యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య గత ఏడాది కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ-బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ సమావేశం అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది.

ఈ ఒప్పందం అమల్లోకి రావడంతో భారత ఎగుమతుల్లో దాదాపు 99 శాతం వస్తువులకు బ్రిటన్ మార్కెట్లో సుంకరహిత (టారిఫ్-ఫ్రీ) ప్రవేశం లభించనుంది. దీంతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

ఉక్కు ఎగుమతులకు ఊరట

ఈ ఒప్పందం అమలులోకి రావడాన్ని ఆలస్యం చేసిన ప్రధాన అంశాల్లో బ్రిటన్ ఉక్కు రక్షణ చర్యలు ఒకటి. అయితే తాజా ఒప్పందం ప్రకారం భారత ఉక్కు ఎగుమతుల్లో 85 శాతం భాగం బ్రిటన్ విధించబోయే ఆంక్షల పరిధికి బయట ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేక దేశ కోటాలు, అదనపు కోటా కేటాయింపులు, అథరైజ్డ్ యూజ్ స్కీమ్ వంటి విధానాలను అమలు చేసినట్లు తెలిపింది.

మోడీ హర్షం

ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. “ఈ ఒప్పందం రైతులు, కార్మికులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ఇది కీలకంగా మారుతుంది” అని మోడీ పేర్కొన్నారు.

పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. “ఇది నూతన తరం వాణిజ్య ఒప్పందం. టెక్స్‌టైల్స్, లెదర్, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్, ప్రాసెస్డ్ ఫుడ్ రంగాలకు భారీ అవకాశాలు లభిస్తాయి” అన్నారు.

ఏ రంగాలకు లాభం?

ఈ ఒప్పందంతో భారత ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, రసాయనాలు, ఔషధాలు, బొమ్మలు, రత్నాలు-ఆభరణాల ఎగుమతులకు పూర్తిగా సుంకరహిత ప్రవేశం లభించనుంది.

సముద్ర ఉత్పత్తులపై 20 శాతం వరకు ఉన్న సుంకాలు రద్దు
టెక్స్‌టైల్స్, దుస్తులపై 12 శాతం సుంకం రద్దు
రసాయన ఉత్పత్తులపై 8 శాతం సుంకం తొలగింపు
లోహ ఉత్పత్తులపై 10 శాతం సుంకం రద్దు
ఇక ప్రాసెస్డ్ ఫుడ్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, లెదర్, పాదరక్షల రంగాలకు కూడా భారీ ఊరట లభించనుంది.

టీ, కాఫీ, మసాలాలకు పెద్ద మార్కెట్

భారత టీ, ఇన్‌స్టంట్ కాఫీ, మసాలా ఉత్పత్తులపై కూడా బ్రిటన్ సుంకాలను పూర్తిగా తొలగించింది. అలాగే స్మార్ట్‌ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్ల ఎగుమతులకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

యూకేకు భారత్ ఇచ్చిన రాయితీలు

ఈ ఒప్పందం కింద యూకే ఉత్పత్తులపై భారత్ సగటు దిగుమతి సుంకాలను 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గించనుంది.

స్కాచ్ విస్కీపై 150 శాతం సుంకం 75శాతానికి తగ్గింపు
10 ఏళ్లలో అది 40 శాతానికి తగ్గనుంది
కార్లపై ప్రస్తుతం ఉన్న 110శాతం సుంకం దశలవారీగా 10శాతానికి తగ్గనుంది
వైద్య పరికరాలు, ఎలక్ట్రికల్ యంత్రాలపై కూడా సుంకాలు తగ్గనున్నాయి
భారత నిపుణులకు అవకాశాలు

ఈ ఒప్పందం కింద ప్రతి ఏడాది 1,800 మంది భారతీయ చెఫ్‌లు, యోగా శిక్షకులు, శాస్త్రీయ సంగీత కళాకారులకు యూకేలో పని చేసే ప్రత్యేక అవకాశాలు లభించనున్నాయి. అలాగే డబుల్ కాంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్ ఒప్పందం ద్వారా యూకేలో పనిచేసే భారతీయ నిపుణులు రెండుసార్లు సామాజిక భద్రతా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. దీని ద్వారా 75,000 మందికి పైగా భారతీయ నిపుణులు, 900కు పైగా కంపెనీలు లాభపడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వాణిజ్యం రెట్టింపు లక్ష్యం

ప్రస్తుతం భారత్-యూకే మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 56 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి దీన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడంతో భారత్-యూకే ఆర్థిక సంబంధాలు మరింత బలపడటంతో పాటు, ఎగుమతులు, ఉపాధి, పెట్టుబడులకు కొత్త ఊపిరి లభించనుంది.