
Infosys: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌కు విశాఖపట్నంలో 20 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ సంస్థ రాష్ట్రంలో సుమారు రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడితో రాష్ట్రానికి భారీ స్థాయిలో ఐటీ రంగంలో వృద్ధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
Read Also: Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ఇక, విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ఏర్పాటు చేయనున్న కొత్త క్యాంపస్ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రారంభ దశలోనే సుమారు 7 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అలాగే విశాఖలో ఐటీ / ఐటీ ఈఎస్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్యాంపస్ ద్వారా సాఫ్ట్‌వేర్ సేవలు, టెక్నాలజీ ఆధారిత సేవలు, బిజినెస్ ప్రాసెస్ రంగాల్లో అవకాశాలు పెరగనున్నాయి.
కాగా, పరిశ్రమలు, ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పటికే అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థ రావడం రాష్ట్రానికి మరింత ప్రాధాన్యతను తీసుకురానుంది. విశాఖపట్నం భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ ఐటీ కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫోసిస్ పెట్టుబడితో నగర అభివృద్ధికి, ఉపాధి కల్పనకు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభించనుంది.