
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన చారిత్రాత్మక విజయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించిన అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్సే తమలో గెలుపుపై నమ్మకాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ ఇన్నింగ్స్ మాకు స్ఫూర్తి..
“ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటగా అనిపించింది. బౌలర్లు వేసే ప్రతి బంతిని అతను ఎంతో సులువుగా ఎదుర్కొంటూ సిక్సర్లు, ఫోర్లు బాదాడు. అతని బ్యాటింగ్ శైలిని గమనించినప్పుడు.. రాహుల్ అంత సులభంగా పరుగులు సాధిస్తున్నాడంటే, ఈ పిచ్‌పై మేము కూడా ఖచ్చితంగా పోరాడగలమనే బలమైన విశ్వాసం నాలో కలిగింది” అని అయ్యర్ వివరించారు. ప్రత్యర్థి ఎంత స్కోరు చేసినా, దానికంటే ఒక పరుగు ఎక్కువే చేయాలనే పట్టుదలతో మైదానంలోకి అడుగుపెట్టినట్లు తెలిపారు.
భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడికి లోనుకాకుండా ఉండటానికి గత మ్యాచుల అనుభవం తోడైందని శ్రేయస్ చెప్పారు. గతంలో కూడా 220 పైచిలుకు స్కోర్లను అలవోకగా ఛేదించిన విషయాన్ని జట్టు సభ్యులకు గుర్తుచేసి వారిలో ధైర్యం నింపారు. ఓపెనర్లు అందించిన మెరుపు ఆరంభం తమ విజయావకాశాలను మెరుగుపరిచిందని, అదే జోరును చివరి వరకు కొనసాగించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. తీవ్రమైన ఎండలో ఆడి అలసిపోయినందున, ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవ్వాలనుకుంటున్నట్లు అయ్యర్ తెలిపారు. భవిష్యత్తు మ్యాచుల కోసం మరిన్ని పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.