
FTA: ప్రపంచం మొత్తం అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో ఏం జరుగుతుందా అని కలవరపడుతుంటే, భారత్ మాత్రం తన దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. తాజాగా, భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) కుదిరింది. సుదీర్ఘ చర్చల తర్వాత, ఇరు దేశాలు సోమవారం ట్రేడ్ అగ్రిమెంట్‌పై సంతకం చేయనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే ఐదేళ్లలో తమ వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారతదేశం, న్యూజిలాండ్‌లు నిర్ణయించుకున్నాయి.
Read Also: Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
ఈ ఒప్పందంపై డిసెంబర్ 22, 2025లో చర్చలు ముగిశాయి. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వస్తువులకు న్యూజిలాండ్‌లో ఎలాంటి సుంకాలు ఉండవు. రాబోయే 15 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని భారత్ మండపంలో రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్‌లే హాజరుకానున్నారు.
ఈ ఒప్పందం ద్వారా భారత్ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు, భారతీయులకు నిపుణులకు తాత్కాలిక ఉపాధి వీసా సుదుపాయాన్ని కల్పిస్తుంది. భారతదేశ మెడికల్ పరికరాలు, మందుల ఎగుమతులు సులువు అవుతాయి. మరోవైపు భారత్, న్యూజిలాండ్ ఉత్పత్తుల్లో 95 శాతం వాటిపై సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం చేస్తుంది. భారతదేశ రైతులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు దెబ్బతినకుండా ఈ ఒప్పందం నుంచి పాల ఉత్పత్తులు, వంట నూనెలు, కూరగాయలు వంటి వస్తువుల్ని తప్పించారు.