Reading Time: < 1 minute
Telangana Land Market Value Revision New Industrial Parks Policy

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంతో పాటు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ‘ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం’ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలను సవరించి, మే మొదటి వారం నుంచి అమలులోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరనుంది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య ఉన్న ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు.. ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్’ విధానాన్ని అత్యంత పారదర్శకగా, ఎటువంటి అవినీతికి తావులేకుండా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు కూడా ఈ విధానంపై హర్షం వ్యక్తం చేస్తూ, భూ వినియోగ మార్పిడి ఛార్జీలను కొంత తగ్గించాలని కోరారు. పరిశ్రమలు లాభసాటిగా ఉండటంతో పాటు పర్యావరణానికి హాని చేయకూడదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

అంతేకాకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి, ఆక్రమణలను అరికట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు భాగస్వామ్యంతో సరికొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.