
Gulf Countries Tension: ఇరాన్-అమెరికా,ఇజ్రాయెల్ వార్ గల్ఫ్ దేశాలకూ భారీ నష్టమే మిగిల్చింది. కొన్నేళ్లు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.40 రోజుల యుద్ధం నలభై ఏళ్లు వెనక్కి నెట్టింది. 16.8 లక్షల కోట్ల ఆర్థిక నష్టం జరిగింది. చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలు దెబ్బతినడం, దుబాయ్ వంటి ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడటం, వాణిజ్య మార్గాలు స్తంభించడంతో ఈ నష్టం వాటిల్లింది.ముఖ్యంగా సౌదీ అరేబియా, UAE లోని చమురు క్షేత్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు జరిగాయి. అలాగే యూఏఈలోని బూర్జ్ ఖలీపా సమీపంలో క్షిపణుల శకలాలు పడటం ఆందోళన కలిగించింది. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గల్ఫ్ దేశాలపై దాడుల చేయడంతో భారీ డ్యామేజ్ జరిగింది. సంపన్నుల పాలిట భూలోక స్వర్గాలుగా, ప్రపంచంలోనే అత్యంత భద్రమైన దేశాలుగా గొప్పగా చెప్పుకొనే గల్ఫ్ దేశాలు యుద్ధగాయాలతో విలవిలల్లాడాయి.పెద్దయెత్తున ఆస్తి,ప్రాణ నష్టం జరిగింది. ఆర్థికంగా బాగా నష్టపోయాయి. భద్రతను దృష్టిలో ఉంచుకొని పలువురు సంపన్నులు గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులపై పునరాలోచనలో పడ్డారు.
ఇరాన్‌కన్నా ఎక్కువగా నష్టపోయింది గల్ఫ్ దేశాలే. యూఏఈ, సౌదీ, కువైట్, ఇరాక్, బహరైన్‌లోని పలు ప్రాంతాలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క యూఏఈపైనే ఇరాన్ దాదాపు 520 క్షిపణులు, 2000 కామికాజీ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో యూఏఈకి ఆర్థిక ఇంజన్లు అయిన దుబాయ్, షార్జా వంటివి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. దుబాయ్ పర్యాటక, రియల్ ఎస్టేట్ రంగాలు కుప్పకూలాయి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును కొనసాగించి, పూర్తిగా నియంత్రించగలిగితే.. ఆ దారి గుండా ఎగుమతి, దిగుమతులకు యూఏఈ పూర్తిగా ఇరాన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అటు.. సౌదీ దగ్గరున్న అత్యాధునిక అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్.. ఇరాన్ దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. ఫలితంగా సౌదీలోని రాస్‌తనూరా వంటి చమురుశుద్ధి కర్మాగారాలు, పలు పారిశ్రామిక ప్రాంతాలు నాశనమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ కాస్త తగ్గి, చర్చలకు రావడానికి.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేసిన ఈ దాడులు కూడా ఒక కారణం. ఇక.. ఈ వార్‌తో అమెరికా ఆర్థికంగా నష్టపోవడమే కాదు. ఆ దేశ పరపతి కూడా పోయింది. ఇన్నాళ్లూ.. మా ఆయుధాలు కొనండి. మా బేస్‌లకు మీ గడ్డపై చోటివ్వండి. మీ భద్రతకు మాదీ హామీ అని గల్ఫ్‌లో పలు దేశాలను యూఎస్ తన అధీనంలో ఉంచుకుంది. కానీ.. ఇరాన్ దాడులతో ఆ హామీలన్నీ ఉత్తుత్తివేనని తేలిపోయింది.
పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్ కుదిరినా గల్ఫ్ దేశాల గుండెల్లో దడ ఆగలేదు.దుబాయ్, దోహా వంటి సుసంపన్న నగరాలు తాము యుద్ధాలకు అతీతమని ఇన్నాళ్లూ నమ్మిన ‘భద్రతా వలయం ఒక్కసారిగా ఛిన్నాభిన్నమైంది. ఇరాన్ ప్రయోగించిన వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్ దాడులు గల్ఫ్ దేశాల రక్షణ వ్యవస్థల్లోని లొసుగులను బయటపెట్టాయి. ఇన్నాళ్లూ అమెరికా తమకు రక్షణ కవచంలా ఉంటుందని నమ్మిన గల్ఫ్ దేశాలకు ఇప్పుడు ఆ నమ్మకం సడలుతోంది. యుద్ధం తీవ్రస్థాయికి చేరినప్పుడు అమెరికా తమను పూర్తిస్థాయిలో కాపాడలేకపోయిందన్న అసంతృప్తి గల్ఫ్ కంట్రీస్‌లో కనిపిస్తోంది. ఇది ఆయా దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై పునరాలోచన చేసేలా చేస్తోంది. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ బలహీనపడవచ్చు కానీ, గాయపడిన పులిలా అది మరింత దూకుడుగా మారే ఛాన్స్ ఉంది.దాని ప్రతాపమంతా గల్ఫ్ మీదే ఉంటుంది.దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ తప్పడం లేదు.ఖతార్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ,సౌదీ అరేబియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండటం ఆయా దేశాలను కలవరపెడుతోంది. చమురు, గ్యాస్ ఎగుమతులకు ఆటంకం కలగడం వల్ల ఈ ఏడాది గల్ఫ్ దేశాలు భారీ ఆర్థిక తిరోగమనాన్ని చవిచూసే ప్రమాదం లేకపోలేదు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వేలాది విదేశీ కుటుంబాలు ప్రాణభయంతో తమ స్వదేశాలకు వెళ్లిపోయాయి. ఇప్పుడు సీజ్‌ఫైర్ కుదిరినా, పరిస్థితులు ఎప్పుడు మళ్లీ విషమిస్తాయోనన్న భయంతో వారు తిరిగి రావడానికి భయపడుతున్నారు. హోటళ్లు, విమానాశ్రయాలు, నీటి శుద్ధి ప్లాంట్ల వంటి కీలక మౌలిక సదుపాయాల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి భవిష్యత్తు ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. ఇరాన్ ఈ మార్గాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూడటం గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే అంశం. పైకి శాంతి ఒప్పందాలు కనిపిస్తున్నా, తెరవెనుక గల్ఫ్ దేశాలు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా, తమ సొంత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ యుద్ధం గుర్తు చేస్తోంది. గల్ఫ్ తీరంలో స్థిరత్వం అనేది ప్రస్తుతానికి ఒక కలగానే కనిపిస్తోంది. సీజ్ ఫైర్ వేళ సైతం…గల్ఫ్ దేశాల్లో మాత్రం అభద్రత నెలకొంది.ఇరాన్ ఏ క్షణం, ఎక్కడ దాడులు చేస్తుందో అనేదానిపై ఆందోళన ఉంది.ఈ క్రమంలోనే సౌదీ అరేబియా, UAE, ఖతార్ లాంటి దేశాలు తమ రక్షణ అవసరాల కోసం ఎల్లప్పుడూ అమెరికాపై ఆధారపడకూడదని నిర్ణయించాయి.ప్రస్తుతం అమెరికా ఆయుధ పరిశ్రమలో ఉన్న సరఫరా జాప్యం, ఉత్పత్తి తగ్గిన కారణంగా గల్ఫ్ దేశాలు ఇప్పుడు దక్షిణ కొరియా, ఉక్రెయిన్ లాంటి దేశాల వైపు చూస్తున్నాయి.
ఇరాన్ ప్రయోగిస్తున్న చౌకైన డ్రోన్లను ఎదుర్కొనేందుకు అమెరికాకు చెందిన ఖరీదైన పేట్రియాట్ మిస్సైల్స్‌ను వాడటం గల్ఫ్ దేశాలకు భారంగా మారుతోంది. అందుకోసమే దీనికి ప్రత్యామ్నాయంగా.. దక్షిణ కొరియాకు చెందిన M-SAM క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం సౌదీ అరేబియా చర్చలు చేస్తోంది. డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేయగల ఈ సిస్టమ్ UAE ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. మరోవైపు బ్రిటన్‌కు చెందిన పలు స్టార్టప్ కంపెనీల నుంచి కూడా తక్కువ ధరకే చిన్న తరహా క్షిపణులను కొనుగోలు చేయాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. కేవలం అమెరికాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తాజాగా ఖతార్ అధికారులు ఉక్రెయిన్ శిక్షణ కేంద్రాలను సందర్శించారు. అక్కడ వాడుతున్న ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు, ఇంటర్‌సెప్టర్ల డ్రోన్ల టెక్నాలజీని పరిశీలించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ తన సొంత అవసరాల కోసం ఆయుధాలను ఎగుమతి చేయడం లేదు. కానీ భవిష్యత్తులో చూసుకుంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే దిశగా ముందుకెళ్తున్నాయి ఈ దేశాలు.
మరోవైపు ఇటీవల అమెరికా UAE, కువైట్ లాంటి దేశాలతో సుమారు 23 బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ అవి డెలివరీ అయ్యేందుకు ఇంకొన్నేళ్లు సమయం పట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అమెరికా.. ఉక్రెయిన్ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో స్విట్జర్లాండ్ లాంటి దేశాలు కూడా తమ ఆర్డర్లను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నాయి. మొత్తానికి గల్ఫ్ దేశాలు తమ భద్రత కోసం కేవలం అమెరికాను మాత్రమే కాకుండా ఇతర దేశాల వైపు చూస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది. వార్‌తో చమురు రంగమే కాదు.. పర్యాటకం, రియల్ ఎస్టేట్, విదేశీ పెట్టుబడులూ ఎఫెక్ట్ అయ్యాయి. గ్యాస్, చమురు ఉత్పత్తులు అగిపోవడంతో గల్ఫ్ దేశాలపై ప్రభావం తీవ్రంగా పడింది. అంతేకాదు సెక్యూరిటీ ప్రతిష్ఠకు డ్యామేజ్ కలిగింది.విదేశీ టూరిస్టులు భారీగా తగ్గిపోవడంతో ఆర్థికంగా భారీ నష్టం తప్పలేదు.
యుద్ధంతో గల్ఫ్ దేశాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది.ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.ఆర్థిక మూలాలను సైతం కదిలించింది. భీకర పోరు ఆ దేశాల జీడీపీని కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు వెన్నెముకైన హర్మూజ్ జలసంధి మీదుగా రాకపోకలు నిలిచిపోవడం అరబ్ దేశాల గుండెలు పగిలేలా చేసింది. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు, పరిశ్రమలపై అపార ప్రభావం ఉంది.చమురు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోపెట్టడం, ఇంధన రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించడంతోపాటు పెట్టుబడులూ పర్యాటకానికి ఆ దేశాలు మళ్లీ ఆకర్షణ కేంద్రాలుగా మారడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. ఖతార్, కువైట్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏకంగా 14 శాతం మేర కుంగిపోతాయని నివేదికలు చెబుతున్నాయి. 1990లలో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ దేశాలు ఎదుర్కొన్న అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇదే.చమురు ఎగుమతులపైనే ఆధారపడ్డ ఈ దేశాలకు ఆదాయ మార్గాలు మూసుకుపోవడం పెను సవాలే. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కొంత మేర ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే.. హర్మూజ్‌తో సంబంధం లేకుండా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గాలు వీటికి అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ సౌదీ జీడీపీ 3 శాతం, యూఏఈ జీడీపీ 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. కేవలం చమురు రంగమే కాకుండా, పర్యాటకం, రియల్ ఎస్టేట్, విదేశీ పెట్టుబడులు కూడా ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
అమెరికా, ఇజ్రాయెల్‌ను నిలువరించాలనే ఉద్దేశంతో హర్మూజ్ జలసంధిని కూడా మూసి వేసింది ఇరాన్. ప్రపంచ చమురు దిగుమతుల్లో 20 నుంచి 25 శాతానికి పైగా ఇక్కడి నుంచి రవాణా అవుతుంది. ఇది గల్ఫ్ దేశాలకు భారీగానే నష్టాన్ని మిగిల్చింది. యుద్ధం కారణంగా చమరు ఉత్పత్రి కేంద్రాలు, రిఫైనరీలను కూడా గల్ఫ్ దేశాలు మూసివేశాయి. గ్యాస్ ఉత్పత్తి సంస్థలు కూడా తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. మొత్తంగా గల్ఫ్ కంట్రీస్‌కు ప్రధాన ఆదాయ వనరులైన గ్యాస్, చమురు ఉత్పత్తులు అగిపోవడం ఆయా దేశాలను తీవ్రంగా దెబ్బతీసింది. చమురు, గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో ఎకానమీ దెబ్బతింది. క్యాపిటల్ ఎకనామిక్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 2 శాతం వరకు క్షీణించే అవకాశం ఉంది. సీజ్ ఫైజ్ తర్వాత ఉద్రిక్తతలు ధీర్ఘాకాలం కొనసాగితే, ఆర్థిక పరిస్థితులు క్షీణించి ఉత్పత్తి ఏకంగా 15 శాతం వరకు పడిపోయే ప్రమాదం వుంది. ముఖ్యంగా ఖతార్, కువైట్‌లపై అధిక ప్రభావం పడే ఛాన్స్ ఉంది. సౌదీ అరేబియా, యూఏఈ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎందుకంటే, అక్కడ పనిచేసే వారిలో చాలామంది విదేశీయులే ఉంటారు. యుద్ధం కారణంగా ఇప్పటికే వేలాది ఆయా దేశాల నుంచి స్వదేశాలకు వెళ్లిపోయారు. సీజ్ ఫైర్ తర్వాత ఒకవేళ యద్ధం ఆగిపోయినా, అంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించడం అంత ఈజీ కాదు. ఇరాన్ దాడివల్ల పలు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వాటి మరమ్మత్తులకు సమయం పట్టొచ్చు. ఆయా దేశాల్లో స్థానికంగా ఉండే మానవ వనరులు చాలా తక్కువ. అందులోనూ ఉద్రిక్తతల వల్ల విదేశీయులు అంత త్వరగా అక్కడికి రావడం సాధ్యం కాదు.
యుద్ధంతో గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యెమెన్, దుబాయ్ వంటి వాటికి చమురు వ్యాపారం ఆగిపోయింది. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నింటికీ చమురే ఆధారం. దాన్ని అమ్ముకొని ఈ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంటే.. వాటి ఆయువుపట్టుపై దెబ్బకొట్టింది ఇరాన్. అక్కడితో అయిపోలేదు. ఇరాన్ లోని ఖార్గ్ దీవిపై దాడి చేయించారు ట్రంప్. ఈ దీవి నుంచే ఇరాన్ తన 90 శాతం చమురు ఎగుమతులు చేస్తోంది. హర్మూజ్ మూసివేత, ఈ దాడి తర్వాత చమురు ధరలు రికార్డ్‌స్థాయిలో పెరిగాయి. ఆతర్వాత ఇరాన్ లోని సౌత్ గ్యాస్ పార్స్ ఫీల్డులపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఫలితంగా ఈ యుద్ధం మరింత తీవ్రమైంది. వెంటనే చమురు ధరలు 5 శాతం పెరిగి.. బ్యారెల్ 110 డాలర్లకు చేరాయి. ఇరాన్ రెచ్చిపోయింది. యూఏఈలోని గ్యాస్ ఫీల్డులపై ఎటాక్ చేసింది. అలాగే ఖతార్ లోని రాస్ లఫ్ఫాన్ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై కూడా దాడి చేసింది.దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిలాంటి ఇంధన ఉత్పత్తి క్షేత్రాలపై ఇరాన్ చేసిన దాడుల వల్ల ఖతార్‌కు భారీ నష్టం వాటిల్లింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతుల్లో 17 శాతం వరకు ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. అంతేకాదు దెబ్బతిన్న కేంద్రాల పునర్నిర్మాణానికి 26 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.
వాస్తవానికి గల్ఫ్ దేశాలు ఇప్పుడిప్పుడే.. ఇతర రంగాలపైనా ఫోకస్ పెట్టాయి. కేవలం.. చమురు నిల్వలని మాత్రమే నమ్ముకోకుండా.. అనేక రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని చూస్తున్నాయి. బిజినెస్, షాపింగ్, రియల్ ఎస్టేట్, హౌజింగ్, బంగారం వ్యాపారం, ఎయిర్‌పోర్టులు.. ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాలని.. ప్రపంచం మొత్తానికి ఓ బిజినెస్ సెంటర్‌గా, సేఫ్ హెవెన్‌గా ఎదిగే దిశగా వెళ్తున్నాయి. అటు పశ్చిమ దేశాలకు, అటు ఆసియాకు మధ్యలో.. సెంటర్ పాయింట్‌గా, వన్ స్టాప్ డెస్టినేషన్‌గా ఉండాలని చూస్తున్నాయి. దాంతో.. గల్ఫ్ కంట్రీస్ అంటే కేవలం చమురు మాత్రమే కాదనే ముద్ర తొలగిపోతోంది. అరబ్ దేశాలంటే.. వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి.కానీ ఇరాన్-అమెరికా యుద్ధంతో సంబంధం లేకపోయినా.. అరబ్ కంట్రీస్.. ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్నాయి.
మూడు దశాబ్దాల పాటు శ్రమించి…నిర్మించుకున్న నగరం. ప్రపంచ వాణిజ్యానికి చిరునామా. పర్యాటకులకు స్వర్గధామం. ఇన్వెస్టర్లకు సేఫ్ హెవన్. ఇదంత యుద్దానికి ముందు. కానీ వార్ మొదలయ్యాక…గల్ఫ్ సీన్ రివర్స్. స్వర్గధామంగా విరాజిల్లిన దుబాయ్ నగరం… ఊహించని సంక్షోభంలో కూరుకుపోయింది.ఇరాన్ దాడులతో అందమైన నగరం…40 రోజుల్లోనే ఘోస్ట్ టౌన్‌ను తలపించింది. గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను దుబాయ్ ఆకర్షించింది. ఉద్రిక్త పరిస్థితులతో నగర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది..ఎడారిలో అద్భుతాన్ని ఆవిష్కరించిన దుబాయ్‌కు ఇది మరో అగ్నిపరీక్ష. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తట్టుకుని, తన భద్రతా ప్రతిష్టను తిరిగి కాపాడుకోగలిగితే దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం గతంలో కంటే మరింత బలంగా ఆవిర్భవిస్తుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇప్పుడు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
150 దేశాల పెట్టుబడిదారులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యూఏఈ జనాభాలో దాదాపు 88-89 శాతం మంది ప్రవాసులు ఉంటారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రాపర్టీ మార్కెట్‌లో వీరిదే హవా.. భారత్ అతిపెద్ద విదేశీ పెట్టుబడుల అడ్డా దుబాయ్. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్ ఆస్తి కొనుగోళ్ల వాటా 20 -22 శాతంగా ఉంది. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు సంధిగ్ధంలో ఉంది. దశాబ్దాలుగా సురక్షిత స్వర్గంగా పేరుగాంచిన ఈ నగరం.. సీజ్ ఫైర్ తర్వాత ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ పరిణామాలు కేవలం భౌగోళిక రాజకీయ మార్పులే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆస్తి మార్కెట్ విశ్వాసాన్ని పరీక్షించే సవాలుగా మారాయి.మధ్యప్రాచ్యంలో ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా ఎదిగిన దుబాయ్ నగరం ఇప్పటివరకు తన రియల్ ఎస్టేట్, టూరిజం రంగాల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఒకప్పుడు కేవలం ఎడారి ప్రాంతంగా ఉన్న ఈ నగరం.. నేడు ఆకాశహర్మ్యాలు.. లగ్జరీ జీవనశైలి, తిరుగులేని భద్రతా ప్రమాణాలతో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మారింది. పన్ను రహిత విధానం.. గోల్డెన్ వీసా వంటి విప్లవాత్మక సంస్కరణలు విదేశీయులను ఇక్కడ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాయి.
దుబాయ్ విజయగాథలో భద్రత అనేది అతిపెద్ద పునాది. ప్రపంచంలోని ధనవంతులు తమ సంపదను ఇక్కడ దాచుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడి స్థిరత్వం.కానీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఈ నమ్మకాన్ని కొంతవరకు సడలించాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు కొన్ని ప్రాంతాలను తాకాయి. నష్ట పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ మానసికంగా ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. ఎప్పుడూ యుద్ధాలకు అతీతంగా ఉండే దుబాయ్ ఆకాశంలో క్షిపణుల సవ్వడి వినిపించడం రియల్ ఎస్టేట్ రంగానికి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ ప్రభుత్వం ఒక క్లిష్టమైన నిర్ణయ దశలో ఉంది. క్షిపణి దాడుల నేపథ్యంలో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం.. దెబ్బతిన్న మౌలిక వసతులను మరమ్మతు చేయడం అత్యవసరం. దీనికి భారీగా నిధులు అవసరం. ఈ అదనపు ఖర్చుల కోసం ప్రభుత్వం కొత్త పన్నులను విధిస్తే ‘పన్ను రహిత నగరం అనే ట్యాగ్ లైన్ పోతుంది. ఇది జరిగితే ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. పన్నులు విధించకపోతే ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పెరుగుతుంది. ధరలు పెంచితే కొనుగోలుదారులు రారు.. తగ్గిస్తే నిర్మాణ సంస్థలు నష్టపోతాయి. ఈ డైలమానే రియల్టర్లను క్యాచ్-22 స్థితిలోకి నెట్టింది.
యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 ఏళ్ల గోల్డెన్ వీసా విధానం ప్రస్తుతం కొంత ఊరటనిస్తోంది. కేవలం రెండు ఏళ్ల వీసాతో ఉన్న వారికంటే ఆస్తి కొనుగోలు చేసి పదేళ్ల నివాస హక్కు పొందిన వారు నగరాన్ని వదిలి వెళ్లడానికి అంత సులభంగా ఇష్టపడరు. కానీ కొత్తగా వచ్చే పెట్టుబడుల విషయంలో మాత్రం మందగమనం కనిపిస్తోంది. యుద్ధ మేఘాలు తొలగిపోతే తప్ప కొత్త ప్రాజెక్టుల అమ్మకాలు ఊపందుకునే ఛాన్స్ లేదు. గత చరిత్రను పరిశీలిస్తే 2008 ఆర్థిక సంక్షోభం లేదా కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల నుంచి దుబాయ్ అద్భుతంగా కోలుకుంది. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవడం ఈ నగరానికి అలవాటు. బలమైన నాయకత్వం, వ్యూహాత్మక దౌత్య నీతితో దుబాయ్ మళ్లీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని గెలుచుకోగలదనేది విశ్లేషకుల మాట. యూఏఈ, సౌదీ అరేబియాలు… విలాసవంతమైన హోటళ్లు, పర్యాటక ఆకర్షణలు. కానీ వార్ టైమ్‌లో లగ్జరీ హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు అనూహ్యంగా 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు, అనిశ్చితి వల్ల వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎమిరేట్స్ వంటి విమానయాన సంస్థలు భారీ నష్టాలను చూశాయి.టూరిజం సీజన్ ముగుస్తున్న తరుణంలో లక్షలాది హోటల్ , టూర్ బుకింగ్స్ రద్దు కావడం వల్ల పర్యాటక రంగం కోలుకోలేని దెబ్బతింది.
అబ్బురంగా, అపురూపంగా స్వయంగా నిర్మించుకున్న దేశాలు…అమెరికా-ఇరాన్ పరస్పర దాడులకు బలయ్యాయి.బ్యాంకాక్, సింగపూర్‌లాగా సహజసిద్ధంగా ఏర్పడినవి కావు. ఏడారిలో ఇసుక, చమురు తప్పా మరేమీ లేని దేశాలు. అలాంటి దేశాలను శిల్పం చెక్కినట్లుగా పాతిక 30 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. ప్రపంచమంతా నమ్మకం పెట్టుకునే ప్రాంతాలుగా మార్చారు. ఆలయాలు కట్టారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వచ్చాయి. అంతర్జాతీయ బ్యాంక్‌లన్నీ అక్కడే పెట్టారు. వరల్డ్ బెస్ట్ షాపింగ్ సెంటర్స్ నెలకొల్పారు. రియల్ ఎస్టేట్‌ను అభివృద్ధి చేశారు. దాడులతో 30 ఏళ్ల కష్టం బూడిదో పోసినట్లయింది. దుబాయ్ అబుదాబీతో పాటు మిగిలిన గల్ఫ్ దేశాలన్నీ తిరిగి పునర్ వైభవం సంపాదించాలంటే ఎంత కష్టం. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడమే యూఏఈకి బిగ్ ఛాలెంజ్. మరోవైపు హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే మొత్తం గల్ఫ్ వాణిజ్యాన్నే పూర్తిగా స్తంభింపజేస్తామని ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ ఓడరేవులపై అమెరికా విధించిన బ్లాకేడ్ ఎత్తివేయకపోతే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రం అంతటా ఎగుమతులు, దిగుమతులను పూర్తిగా నిరోధిస్తామని హెచ్చరించింది. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. అమెరికా హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడం ఇరుదేశాల మధ్య కుదిరిన తాత్కలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించింది. ఒకవైపు ఇరాన్ దళాలు మరోవైపు అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో హర్మూజ్ జలసంధి దగ్గర టెన్షన్ వాతావరం నెలకొంది. ఈ క్రమంలో తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధనం ఎత్తివేయకపోతే మొత్తం గల్ఫ్ వాణిజ్యాన్నే స్తంభింపజేస్తామని అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం గల్ఫ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.ఇప్పటికే ఎంతో నష్టాన్ని చూసిన ఈ దేశాలు..సీజ్ ఫైర్ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాయి.