
- నిర్మల్ జిల్లా బాసరలో ఘటన
- మృతులు సికింద్రాబాద్ వాసులు
బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరిలో మునిగి ముగ్గురు అన్నదమ్ములు చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ కు చెందిన 8 మంది కుంటుంబ సభ్యులు సరస్వతీ దేవి దర్శనానికి బాసరకు వచ్చారు. స్నానాలు చేసేందుకు ట్రిపుల్ ఐటీ ఇంటెక్ వాల్ పరిసరాల్లో స్నానాలు చేసేందుకు దిగారు. చంద్రశేఖర్(38) నదిలోకి వెళ్లి స్నానం చేస్తుండగా నదిలో మునిగిపోయాడు.
అతడిని కాపాడేందుకు వెళ్లిన తమ్ముడు రాంచందర్(36) కూడా మునిగిపోగా, అన్నలను రక్షించేందుకు వెళ్లిన తమ్ముడు మల్లేశ్ కుమార్(31) కూడా నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ దీపక్ పోలీసులతో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు చేపట్టి డెడ్‌బాడీలను బయటకు తీయించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నదిలో మునిగి చనిపోవడంతో, వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం కోసం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. స్థానికుల సహకారంతో బాధిత కుటుంబ సభ్యులను హైదరాబాద్ కు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఇదిలాఉంటే బాసరలో గోదావరి ఘాట్ వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో భక్తులు స్నానాలు చేస్తుండగా, అక్కడ హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికైనా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.