Reading Time: < 1 minute
Bangladesh Beaten Australia By 86 Runs In 1st Odi Mosaddek Hossain Stars In Dhaka

BAN vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్‌ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో ఆస్ట్రేలియాకు 42.2 ఓవర్లలో 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆసీస్ 191/9కే పరిమితమైంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ టాంజిద్ హసన్ 54 పరుగులతో శుభారంభం అందించగా, నజ్ముల్ హొసైన్ షాంటో 67 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్‌ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపు మళ్లించింది మాత్రం మోసద్దెక్ హొసైన్. అతడు 70 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 86 పరుగులు చేసి జట్టుకు మంచి ఫైటింగ్ స్కోరు అందించాడు. చివర్లో టాస్కిన్ అహ్మద్ 20 పరుగులతో వేగంగా ఆడడంతో బంగ్లాదేశ్ స్కోరు 284 పరుగులకు చేరుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3 వికెట్లు పడగొట్టగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రెన్‌షా చెరో రెండు వికెట్లు సాధించగా, జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ తీశాడు.

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. తొలి బంతికే మాథ్యూ షార్ట్ డకౌట్ కాగా, మార్నస్ లబుషేన్ కూడా ఒక పరుగుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ (19), కూపర్ కానోలీ (35), అలెక్స్ క్యారీ (47) కొంతసేపు పోరాడినా బంగ్లా బౌలర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. ఒకవైపు కెమెరాన్ గ్రీన్ 52 పరుగులతో అజేయంగా నిలిచినా.. అతడికి మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. దీనితో తక్కువ స్కోర్ కే ఆస్ట్రేలియా పరిమితమైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రాణా 4 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. మోసద్దెక్ హొసైన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ లు 2 వికెట్లతో రాణించారు. ఇంకా టాస్కిన్ అహ్మద్ ఒక వికెట్ సాధించాడు. బ్యాటింగ్‌లో అజేయ 86 పరుగులు, బౌలింగ్‌లో 2/37తో మెరిసిన మోసద్దెక్ హొసైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.