
Arjun Tendulkar Fan Gesture: ముంబై టీ20 లీగ్ 2026లో యువ ఆల్‌రౌండర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన ఆటతోనే కాదు.. గొప్ప మనసుతో కూడా అందరి ప్రశంసలు అందుకున్నాడు. మైదానంలో బ్యాట్, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన అర్జున్.. మ్యాచ్ అనంతరం చేసిన ఒక చిన్న పని అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇందుకు సంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చిన్నారి తాకిన బంతి:
లీగ్‌లో భాగంగా సోమవారం ఏఆర్‌సీఎస్ అంధేరీ, బాంద్రా బ్లాస్టర్స్ టీమ్స్ తలపడ్డాయి. అర్జున్ టెండూల్కర్ అంధేరీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మ్యాచ్ సందర్భంగా అర్జున్ కొట్టిన భారీ సిక్సర్ నేరుగా స్టాండ్స్‌లోని ఒక చిన్నారి తలకు తగిలింది. బంతి బలంగా తాకడంతో ఆ బాలుడు నొప్పితో విలవిల్లాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ బాలుడిని ప్రత్యేకంగా కలిసి.. అతడి ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చాడు. ఐస్ ప్యాక్‌తో తలకు చికిత్స తీసుకుంటున్న ఆ చిన్నారిని కలిసిన అర్జున్.. మ్యాచ్‌లో ఉపయోగించిన బంతిని తన సంతకంతో బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు చిన్నారి తలపై చేయి వేసి పలకరిండాడు.
సచిన్ లాగే వినయంగా:
ఈ సంఘటనకు సంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లైకులు, కామెంట్ల వర్షం కురిసింది. అర్జున్ తన తండ్రి సచిన్ టెండూల్కర్ లాగే ఎంతో వినయంగా వ్యవహరించాడు అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో బాంద్రా బ్లాస్టర్స్‌పై 9 వికెట్ల తేడాతో ఏఆర్‌సీఎస్ అంధేరీ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో అర్జున్ కీలక పాత్ర పోషించాడు. 3 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండటం విశేషం. అతడి అద్భుత బౌలింగ్‌తో బాంద్రా బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 144/9 స్కోరుకే పరిమితమైంది.
34 బంతుల్లోనే 66 పరుగులు:
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏఆర్‌సీఎస్ అంధేరి జట్టు ఓపెనర్ దివ్యాంశ్ సక్సేనా త్వరగా ఔట్ అయ్యాడు. ఈ సమయంలో అర్జున్ టెండూల్కర్, ముషీర్ ఖాన్ కలిసి మ్యాచ్‌ను పూర్తి చేశారు. ఇద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అర్జున్ కేవలం 34 బంతుల్లోనే 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముషీర్ ఖాన్ 38 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంధేరి 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 37 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది.
A six from #ArjunTendulkar accidentally struck a child in the stands. After the match, #Arjun met the young fan and gifted him the same ball with his autograph.
A class act that reflects #Humanity , #Kindness and #Sportsmanship
#Cricket #SachinTendulkar #Heartwarming pic.twitter.com/OSOAkpVV1I
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) June 8, 2026


