
హైదరాబాద్: R&B చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. మోహన్ నాయక్‌కు సంబంధించి మొత్తం రూ.17.94 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు మోహన్ నాయక్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో మంగళవారం (జూన్ 9) హైదరాబాద్‌లోని మోహన్ నాయక్ నివాసంతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
సోదాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 19.38 ఎకరాల వ్యవసాయ భూములు గుర్తించారు అధికారులు. అలాగే, కొంపల్లి, గచ్చిబౌలిలో కలిపి 7 ఫ్లాట్లు.. మియాపూర్‌లో రూ.2.5 కోట్ల విలువైన ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్‌లో విల్లా కొనుగోలుకు రూ.1 కోటి అడ్వాన్స్ చెల్లించినట్లు గుర్తించారు.
►ALSO READ | పట్టపగలే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దోచుకునే చర్య: మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై కేసీ వేణుగోపాల్ ఫైర్
సోదాల్లో రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు.. బ్యాంకు ఖాతాల్లో రూ.1.44 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 2.5 కిలోల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి ఆభరణాలు లభించాయని తెలిపారు. రూ.1.26 కోట్ల విలువైన గృహోపకరణాలు, రూ.11.25 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు గుర్తించారు.
రెండు వాహనాలు సీజ్ చేశారు. ఇప్పటివరకు గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ రూ.17.94 కోట్లుగా ఏసీబీ అంచనా వేసింది. ఆస్తుల మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే మరింత ఎక్కువగా ఉండొచ్చని సమాచారం. మోహన్ నాయక్‌ను అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. మరిన్ని ఆస్తులపై విచారణ జరుగుతోందని తెలిపారు.