Reading Time: 1 minute
Moeen Ali Chooses Psl Over Ipl Reveals Real Reason Behind Decision

ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రపంచంలోనే బెస్ట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్‌)ను వదిలి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎఎల్)లో ఆడాలని నిర్ణయించుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఐపీఎల్, పీఎస్‌ఎల్ షెడ్యూల్‌లు ఒకే సమయంలో ఉండడంతో.. విదేశీ ఆటగాళ్లు ఒక లీగ్‌ను మాత్రమే ఎంచుకోవాల్సి వస్తుంది. చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అయితే మొయిన్ అలీ మాత్రం భిన్నంగా పీఎస్‌ఎల్‌లో ఆడడానికే మొగ్గు చూపాడు.

తాజాగా ఒక పోడ్కాస్ట్‌లో మాట్లాడిన మొయిన్ అలీ.. ఐపీఎల్‌ను కాదని పీఎస్‌ఎల్‌లో ఆడడానికి గల కారణాలను వెల్లడించాడు. ‘నా వయసు ఇప్పుడు 38. ఇంకనూ నేను మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నాను. నా కెరీర్‌ను సాధ్యమైనంత ఎక్కువ కాలం కొనసాగించాలని ఉంది. పీఎస్‌ఎల్ చిన్న టోర్నమెంట్ కావడం నా కుటుంబానికి, నాకు అనుకూలంగా ఉంది. అలాగే కరాచీ టీమ్ కూడా నా నిర్ణయంకు ప్రాధాన్యత ఇస్తోంది’ అని అలీ తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడిన అలీకి పెద్దగా అవకాశాలు రాలేదు. రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్.. అతడిని కేవలం 6 మ్యాచ్‌లలో మాత్రమే ఆడించింది. అందులోనూ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా రాలేదు.

Also Read: SRH vs CSK Tickets: డబుల్ రేట్స్, అయినా ఎక్కడా దొరకని టికెట్స్.. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా?

కేకేఆర్ జట్టులో ఆడడంపై స్పందించిన మొయిన్ అలీ… ‘గత సీజన్‌లో నేను ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. బ్యాటింగ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. నేను ఎక్కువగా మైదానంలో ఉండాలని, బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నాను. కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ.. మంచి క్రికెట్ ఆడుతున్నానని భావిస్తున్నాను. కేకేఆర్ నాకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు’ అని చెప్పాడు. పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న అలీ.. సంవత్సరానికి రూ.2.14 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ‘ఎక్కడా శాశ్వత స్థానం ఉండదు. కానీ నేను నా ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని ఉంది. పీఎస్‌ఎల్‌లో ఆడాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది. అయితే షెడ్యూల్ క్లాష్ కారణంగా ఇప్పటివరకు సాధ్యపడలేదు’ అని పేర్కొన్నాడు. కెరీర్‌ను కొనసాగించడం, కుటుంబానికి సమయం కేటాయించడం, అలాగే ఎక్కువ అవకాశాలు దక్కడం వంటి కారణాలతో అలీ ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.