Reading Time: 2 minutes
Ruturaj Gaikwad Reveals Secret Behind Match Winning Century Against Sri Lanka A

ట్రై నేషన్ ఏ సిరీస్ 2026లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. సెంచరీతో భారత్‌-ఏ జట్టుకు విజయం అందించిన రుతురాజ్ గైక్వాడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 114 బంతుల్లో 101 పరుగులు చేసి భారత్‌-ఏ జట్టుకు భారీ స్కోరు అందించాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎలాంటి గణాంకాలు తెలియవని, అయితే సెంచరీ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమేనని రుతురాజ్ చెప్పాడు.

‘మీరు చెప్పిన గణాంకాల గురించి నాకు తెలియదు. కానీ సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడి పరిస్థితులు మేము స్వదేశంలో ఆడే పిచ్‌లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. గాలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అందుకే క్రీజులో సెట్ అయిన బ్యాటర్ చివరి వరకు ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజు ఆ బాధ్యతను నేను తీసుకున్నా. చాలా సంతోషంగా ఉంది. వీలైనంత ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేయడానికే ప్రయత్నించాను. అప్పటికే మేము మూడు వికెట్లు కోల్పోయాం. అలాంటి సమయంలో కొత్త బ్యాటర్ వచ్చి మిడిల్ ఓవర్లలో ఇబ్బంది పడకూడదని భావించాం. అందుకే నేను, తిలక్ వర్మ కలిసి ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం’ అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.

నాలుగో వికెట్‌కు కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి 150 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేసుకున్న రుతురాజ్.. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించగలమనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నాడు. ‘మేము ఎంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అంత మంచిదని భావించాం. డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం మాకు ఉందని తెలుసు. కానీ శ్రీలంక బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. వారు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఒక దశలో మేము 290 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేస్తామని అనుకున్నాం. కానీ శ్రీలంక బౌలర్లు మమ్మల్ని అడ్డుకున్నారు. వారు చాలా బాగా బౌలింగ్ చేశారు’ అని అన్నాడు.

ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులతో మెరిసి భారత్‌-ఏ జట్టు 277 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం భారత బౌలర్లు సమిష్టిగా రాణించి శ్రీలంక-ఏను 269 పరుగులకు ఆలౌట్ చేయడంతో.. భారత్‌-ఏ 8 పరుగుల తేడాతో త్రిల్లింగ్ విక్టరీ సాధించింది.