Reading Time: 2 minutes
ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లి.. బురఖాలో ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి షాకైన తల్లిదండ్రులు!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సభ్య సమాజం సిగ్గుపడేలా చేసే ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ పేరుతో వలలో వేసుకుని, మత మార్పిడికి ఒత్తిడి తెస్తూ దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఒక గ్యాంగ్‌ బాగోతం బట్టబయలైంది. బాధితుల్లో ఒకరైన అశోక్‌నగర్ నివాసి, మరో ఇద్దరు బాలికలతో కలిసి బురఖా ధరించి ఇంటికి రావడంతో ఈ దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెను ఆ స్థితిలో చూసి ఆ కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అశోక్ నగర్ జిల్లా పిప్రాయ్‌కి చెందిన ఒక మైనర్ బాలిక నాలుగు నెలల క్రితం రైల్వే స్టేషన్‌లో అల్తమాష్ అనే యువకుడిని కలిసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మాయమాటలతో ఆమెను భోపాల్‌కు తీసుకెళ్లిన అల్తమాష్, అక్కడ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కేవలం శారీరక వేధింపులతో ఆగకుండా, బాధితురాలిని ఇస్లాంలోకి మారాలని బలవంతం చేశాడు. ఆమె మెదడును పూర్తిగా మార్చివేసేలా నిరంతరం ప్రయత్నించాడని బాధితులు తన గోడు వెళ్లబోసుకుంది.

అశోక్‌నగర్ బాధితురాలు మరో ఇద్దరు బాలికలతో కలిసి బురఖా ధరించి తన స్వగ్రామానికి చేరుకోవడంతో ఈ రహస్యం బయటపడింది. హిందూ కుటుంబానికి చెందిన తమ కుమార్తె ఆ స్థితిలో ఉండటం చూసి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నిలదీసి అడగ్గా, ఆమె తనపై జరిగిన అఘాయిత్యాలను ఏకరువు పెట్టింది. దీంతో ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు, హిందూ సంఘాల మద్దతుతో పోలీసులను ఆశ్రయించారు.

ఈ దారుణమైన చర్యలో అల్తమాష్ ఒక్కడే లేడని దర్యాప్తులో వెల్లడైంది. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అల్తమాష్‌తో పాటు అర్హాన్ ఖాన్, అహత్ ఖాన్ అనే మరో ఇద్దరు నిందితులు కూడా ఈ దారుణాల్లో భాగస్వాములని తెలిసింది. వారు భోపాల్‌కు చెందిన మరో ఇద్దరు మైనర్ బాలికలను కూడా ఇదే విధంగా మోసగించి, అత్యాచారాలకు పాల్పడుతూ, మత మార్పిడి కోసం చిత్రహింసలకు గురిచేశారు. ఒక పద్ధతి ప్రకారం అమాయకపు మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్న ముఠాగా పోలీసులు వీరిని గుర్తించారు. నిందితులపై అత్యాచారం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం, మత స్వేచ్ఛ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అశోక్ నగర్ ఎస్డీఓపీ వివేక్ శర్మ తెలిపారు. ప్రధాన నిందితుడు అల్తమాష్ ప్రస్తుతం మరో కేసులో జైలులో ఉండగా, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం భోపాల్ పరిసరాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ ఘటన ‘లవ్ జిహాద్’, వ్యవస్థీకృత మతమార్పిడి కుట్రలో భాగమని స్థానిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని, ఇలాంటి ముఠాల వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ దిశగా లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..