Reading Time: 2 minutes
Watermelon Seeds: పండుతోపాటు గింజలను కూడా తినేస్తున్నారా?.. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకే..

పుచ్చకాయ తినేటప్పుడు చాలామంది గింజలను వేరు చేసి పారేస్తుంటారు. కానీ ఈ చిన్న గింజలు పోషకాల గని అని మీకు తెలుసా? పుచ్చకాయ గింజలను నమిలి తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాల గురించి డైటీషియన్ రంజనా సింగ్ అందిస్తున్న ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాల నిధి..
డైటీషియన్ రంజనా సింగ్ ప్రకారం, పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఐరన్ జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా, కండరాల బలోపేతానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో తోడ్పడతాయి. అయితే ఈ పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించాలంటే గింజలను నమిలి తినడం చాలా ముఖ్యం. గింజలను నమలకుండా నేరుగా మింగేయడం వల్ల వాటిలోని పూర్తి ప్రయోజనాలను మనం పొందలేము. అంతేకాకుండా, వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఎలా తీసుకోవాలి? నిపుణుల సూచనలు
పుచ్చకాయ గింజలను నేరుగా పండుతో పాటు నమిలి తినవచ్చు లేదా వాటిని సేకరించి ఎండబెట్టి, దోరగా వేయించుకుని చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు. వేయించిన గింజలు రుచిగా ఉండటమే కాకుండా సులభంగా జీర్ణమవుతాయి. అయితే ఏ వస్తువైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. పుచ్చకాయ గింజలను కూడా మోతాదుకు మించి తీసుకోకూడదు. సాధారణ ఆరోగ్యవంతులకు ఇవి ఎంతో మేలు చేసినప్పటికీ, వీటిని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
పుచ్చకాయ గింజలు సురక్షితమైనవే అయినప్పటికీ, జీర్ణ సంబంధిత సమస్యలు అంటే గ్యాస్, ఎసిడిటీ లేదా అజీర్తితో బాధపడేవారు వీటిని అధికంగా తీసుకోకూడదు. గింజలు కడుపులో భారంగా అనిపించేలా చేసే అవకాశం ఉంది. చిన్న పిల్లలు వృద్ధులు వీటిని నమలకుండా మింగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కిడ్నీలో రాళ్లు లేదా మినరల్స్ అసమతుల్యత ఉన్నవారు తమ ఆహారంలో వీటిని చేర్చుకునే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తూ పుచ్చకాయ గింజలను మీ ఆహారంలో భాగం చేసుకుంటే, వేసవిలో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన ఖనిజాలను సహజంగానే పొందవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందించబడింది. మీ ఆహారపు అలవాట్లలో ఏవైనా పెద్ద మార్పులు చేసే ముందు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించడం శ్రేయస్కరం. ఏదైనా ఇంటి చిట్కాలు పాటించే ముందు వైద్య సలహా తప్పనిసరి.