Reading Time: 2 minutes
Vaibhav Suryavanshi: చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. కట్‌చేస్తే.. ప్రమాదంలో ఆ డేంజరస్ రికార్డ్..!

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో చెలరేగిపోతున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. ఇక ఈ బుడ్డోడి ధాటికి ఏప్రిల్ 19న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఓ డేంజరస్ రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యాడు. భారత టీ20 క్రికెట్‌లో అరుదైన ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఇప్పుడు వైభవ్ ముంగిట ఉంది. అదేంటో ఓసారి చూద్దాం..

భారత క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం దేవదత్ పడిక్కల్ పేరిట ఉంది. పడిక్కల్ 25 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించగా, వైభవ్ సూర్యవంశీ కేవలం 23 ఇన్నింగ్స్‌లలోనే 901 పరుగులు పూర్తి చేశాడు. ఏప్రిల్ 19న ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే తన 24వ ఇన్నింగ్స్‌లో వైభవ్ మరో 99 పరుగులు సాధిస్తే, పడిక్కల్ రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు. గత మ్యాచ్‌లో సున్నాకే వెనుదిరగడంతో ప్రపంచ రికార్డును సమం చేసే అవకాశం చేజారినప్పటికీ, భారత రికార్డును సొంతం చేసుకునే అవకాశం మాత్రం ఇంకా సజీవంగానే ఉంది.

ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీతో పోటీ..

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ కేవలం 5 ఇన్నింగ్స్‌లలోనే 200 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందులో 18 ఫోర్లు, 18 సిక్సర్లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం పరుగుల పట్టికలో విరాట్ కోహ్లీ 228 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌లో వైభవ్ కేవలం 29 పరుగులు సాధించినా, కోహ్లీని వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగితే రికార్డుల వేట ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ తన 24వ ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని చేరుకుంటే, ప్రపంచ స్థాయిలో మూడవ స్థానాన్ని మరియు భారత స్థాయిలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తాడు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్, ఇప్పుడు మరో భారీ ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏప్రిల్ 19న జరిగే పోరు వైభవ్ కెరీర్‌లోనే ఒక కీలక మలుపుగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..