Reading Time: 2 minutes
ప్రతిరోజూ కేవలం 6 నిమిషాలు ఏదైనా పుస్తకం చదవండి..! ఇది మీ శరీరం, ఆరోగ్యంపై చేసే మ్యాజిక్‌ తెలిస్తే..

నేటి డిజిటల్ యుగంలో మనలో చాలా మంది మన సమయాన్ని మొబైల్ స్క్రీన్‌లను స్క్రోల్ చేయడానికే కేటాయిస్తున్నాము. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు, మనం ఎక్కువ టైమ్‌ మొబైల్ స్క్రీన్‌లను స్క్రోల్ చేస్తూనే గడుపుతాము. విచ్చలవిడి ఇంటర్‌ నెట్‌ ప్రభావంతో మనం సమాచార వరదలో కొట్టుకుపోతున్నాం. కానీ, ఈ రీల్స్, షార్ట్స్ ప్రపంచంలో మనం మన ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను కోల్పోతున్నామనే విషయాన్ని ఎవరు గుర్తించటం లేదు. చాలా మందికి చదవడం ఇష్టం, కానీ, ఫోన్ వాడే అలవాటు ఎంతగా పాతుకుపోయిందంటే, ప్రతి ఐదు నిమిషాలకు, ఎవరి నుంచైనా సందేశం వచ్చినా రాకపోయినా, వారి చేయి ఫోన్ వైపు వెళ్తుంది. ఒక్కసారి ఫోన్ అన్‌లాక్ చేశాక, తర్వాతి 10-15 నిమిషాలు అలా గడిచిపోతాయి. అంతే సోషల్ మీడియా చూసే అలవాటును ఎలా వదిలించుకోవాలో, చదవడం పట్ల ప్రేమను ఎలా పెంపొందించుకోవాలో కొన్ని చిట్కాలను నేర్చుకుందాం.

సోషల్ మీడియా vs పుస్తక పఠనం:

సోషల్ మీడియా వల్ల ఆలోచనల్లో గందరగోళం పెరుగుతుంది. అదే పుస్తకం చదివితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిరంతరం రీల్స్ చూడటం వల్ల మన అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. పుస్తకాలు చదవడం వల్ల ఊహాశక్తి, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. ఇతరుల జీవితాలతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల ఒత్తిడి వస్తుంది. పుస్తకం చదవడం వల్ల మనతో మనం సంభాషించుకునే అవకాశం లభిస్తుంది.

పుస్తకాలు చదివే అలవాటును పెంచుకోవడానికి చిట్కాలు:

5-10 పేజీల సూత్రం: ఒకేసారి పెద్ద పుస్తకం చదవాలని అనుకోకండి. రోజుకు కేవలం 5 లేదా 10 పేజీలు చదవాలనే చిన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇది మీ మెదడుకు భారం అనిపించదు.

బెడ్‌రూమ్‌లో మొబైల్ వద్దు: నిద్రపోయే అరగంట ముందు మొబైల్‌ను పక్కన పెట్టండి. డిజిటల్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్‌కు బదులుగా పుస్తకాన్ని చదవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

మీకు నచ్చిన విషయం ఎంచుకోండి: చదవడం అంటే కేవలం క్లిష్టమైన తత్వశాస్త్రం లేదా పెద్ద నవలలే కాదు. మీకు వంటలు, పెట్టుబడులు, ప్రయాణాలు లేదా జోక్స్ అంటే ఇష్టమైతే, అక్కడి నుండి ప్రారంభించండి.

చదవటం ఒక దివ్యౌషధం: పరిశోధనల ప్రకారం, కేవలం 6 నిమిషాల పాటు ప్రశాంతంగా చదవడం వల్ల ఒత్తిడి 68శాతం తగ్గుతుంది. ఇది మీ పదజాలాన్ని పెంచుతుంది, సంభాషణ చాతుర్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ప్రపంచాన్ని చూసే కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. పుస్తకాలు మనం జేబులో పెట్టుకుని తిరగగలిగే ఏకైక మాయాజాలం. కాబట్టి నేటి నుండే మీ పఠన ప్రయాణాన్ని ప్రారంభించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..