Reading Time: 2 minutes
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ షో.. ఐపీఎల్ 2026 నంబర్లు చూస్తుంటే రిటైర్మెంట్ దగ్గర్లోనే ఉందా?

Suryakumar Yadav : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఎదురీదుతుంటే, ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఇప్పుడు టీమిండియా సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకప్పుడు మైదానం నలుమూలలా బంతిని బాదుతూ మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న సూర్య, ఇప్పుడు కనీసం క్రీజులో నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అవ్వడంతో సూర్య కెరీర్ ముగిసిపోయిందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

సూర్యకుమార్ యాదవ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. అతని స్కోర్లు వరుసగా 16, 51, 6, 33, తాజాగా పంజాబ్ కింగ్స్ మీద 0 (డకౌట్). ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ పై చేసిన 51 పరుగులు కూడా 36 బంతుల్లో వచ్చాయి. ఒకప్పుడు 150-200 స్ట్రైక్ రేట్ తో ఆడే సూర్య, ఇప్పుడు బంతులను వృథా చేయడం చూస్తుంటే అతనిలో ఆ పాత వాడి వేడి తగ్గిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా స్లో బాల్స్ వేస్తున్న బౌలర్లకు సూర్య దగ్గర సమాధానం లేకుండా పోతోంది.

గతంలో సూర్యకుమార్ యాదవ్ రాంప్ షాట్లు లేదా ఇన్-అవుట్ షాట్లు ఆడితే అది కచ్చితంగా బౌండరీకి వెళ్లేది. కానీ ఇప్పుడు బౌలర్లు అతని మీద పక్కా ప్లాన్ తో వస్తున్నారు. అతనికి వేగం తగ్గించి బంతులు వేయడం వల్ల సూర్య టైమింగ్ దెబ్బతింటోంది. గతంలో ఏ మాత్రం భయం లేకుండా క్రీజులోకి వచ్చే స్కై, ఇప్పుడు ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అతని బ్యాటింగ్ లో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సూర్య వైఫల్యం ఒకవైపు ఉంటే, మరోవైపు శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా, ఫీల్డింగ్ లోనూ మెరుస్తున్నాడు. రజత్ పాటిదార్ కూడా నిలకడగా పరుగులు సాధిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 35 ఏళ్ల సూర్యకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం యువ ఆటగాళ్లకు అన్యాయం చేయడమే అవుతుందనే వాదన వినిపిస్తోంది.

వచ్చే జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్ సూర్య కెరీర్‌కు కీలకం కానుంది. ఒకవేళ అక్కడ కూడా అతను విఫలమైతే, టీమిండియా మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయం తీసుకోవడం ఖాయం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత టీమ్ నుంచి తప్పుకునే తదుపరి సీనియర్ ఆటగాడు సూర్యనే కావచ్చు. 2028 ఒలింపిక్స్, వరల్డ్ కప్ ఆడాలని సూర్య కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ చూస్తుంటే అది కలగానే మిగిలిపోయేలా ఉంది. మరి హిట్‌మ్యాన్ వారసుడిగా వచ్చిన సూర్య మళ్ళీ పుంజుకుంటాడో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..