Reading Time: 2 minutes
Rohit Sharma : రోహిత్ శర్మ మిషన్ 2027.. సౌతాఫ్రికా వరల్డ్ కప్‌పై హిట్‌మ్యాన్ గురి.. అగార్కర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

Rohit Sharma : టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కన్ను ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్‌పై పడింది. 39 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, దేశం కోసం మరో ప్రపంచకప్ తీసుకురావాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో హామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నప్పటికీ, రోహిత్ తన లక్ష్యం నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రోహిత్ శర్మ ప్రస్తుతం కెరీర్‌లో ఒక కీలక దశలో ఉన్నారు. 39 ఏళ్లకు చేరువలో ఉన్నా, తన బరువు తగ్గించుకుని ఫిట్‌గా ఉండటానికి ఆయన చేసిన కృషి అమోఘమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ చేజారిన బాధ రోహిత్‌ను ఇంకా వెంటాడుతూనే ఉంది. అందుకే, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ, 50 ఓవర్ల వరల్డ్ కప్‌ను ముద్దాడాలనే కసి ఆయనలో కనిపిస్తోంది. వచ్చే 18 నెలల కాలం రోహిత్ కెరీర్‌కు అత్యంత కీలకం కానుంది.

రోహిత్ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. రోహిత్ ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. “25 ఏళ్ల వయసులో ఉండే ఫిట్‌నెస్ 38 ఏళ్లలో ఉండకపోవచ్చు, కానీ రోహిత్ ఫీల్డింగ్ చూస్తుంటే అలా అనిపించదు. అతను క్విక్ సింగిల్స్ తీస్తున్నాడు, మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటున్నాడు. 2007లో ధోని అతనికి అవకాశం ఇవ్వనప్పుడు కూడా ఛాన్స్ వస్తే దుమ్ములేపుతాను అని చెప్పి నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా 2027 వరల్డ్ కప్ ఆడతాడు, గెలుస్తాడు” అని ధీమా వ్యక్తం చేశారు.

మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా రోహిత్‌కు మద్దతుగా నిలిచారు. “క్రికెట్‌లో ఫామ్, ఫిట్‌నెస్ ముఖ్యం తప్ప వయసు కాదు. రోహిత్ టెక్నిక్, మ్యాచ్‌లను గెలిపించే సామర్థ్యం అసాధారణం. అతను ఫిట్‌గా ఉన్నంత కాలం అతడిని జట్టు నుంచి తప్పించలేరు” అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు. సునీల్ గవాస్కర్ 38 ఏళ్ల వయసులో 1987 వరల్డ్ కప్ ఆడారు, రోహిత్ కూడా అదే బాటలో నడుస్తూ కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

ప్రస్తుత ఐపీఎల్‌లో రోహిత్ ఎదుర్కొంటున్న హామ్‌స్ట్రింగ్ గాయం కొంత ఆందోళన కలిగిస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై తరఫున ఆడుతున్న రోహిత్, రాబోయే కొన్ని మ్యాచ్‌లకు దూరం కావచ్చు. అయితే, ఐపీఎల్ ముగిసిన తర్వాత రోహిత్ కేవలం వన్డేలపైనే దృష్టి సారించనుండటంతో, అతనికి తగినంత విశ్రాంతి, ప్రాక్టీస్ లభిస్తాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లతో జరిగే సిరీస్‌లలో రోహిత్ తన సత్తా చాటగలిగితే, 2027 వరల్డ్ కప్ టికెట్ దాదాపు ఖాయమైనట్లే.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..