
Ajinkya Rahane : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న తరుణంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శిబిరంలో కలకలం రేగింది. కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే తన పదవికి రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టును గాడిలో పెట్టలేక రహానే తప్పుకున్నారని, కొత్త కెప్టెన్ రాబోతున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఈ వైరల్ వార్తల వెనుక ఉన్న అసలు నిజానిజాలెంటో చూద్దాం.
వైరల్ అవుతున్న వార్త ఏమిటి?
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన ఏకైక జట్టు కేకేఆర్. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్ అజింక్యా రహానే తన పదవికి రాజీనామా చేశాడని, త్వరలోనే రింకూ సింగ్ లేదా మరెవరైనా కొత్త బాధ్యతలు చేపడతారని ఎక్స్, ఫేస్‌బుక్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. TrustMeBroNews వంటి ఫేక్ హ్యాండిల్స్ నుంచి వచ్చిన సమాచారంతో ఫ్యాన్స్ అయోమయానికి గురయ్యారు.
అసలు నిజం ఇదీ
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టమైంది. అజింక్యా రహానే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కేకేఆర్ మేనేజ్‌మెంట్ గానీ, రహానే స్వయంగా గానీ ఎక్కడా ప్రకటించలేదు. ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా బీసీసీఐ నుంచి కూడా ఇలాంటి స్టేట్‌మెంట్ రాలేదు. ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు రహానే కెప్టెన్‌గా, రింకూ సింగ్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో కావాలనే కొందరు నెటిజన్లు ఫేక్ గ్రాఫిక్స్‌తో ఈ వార్తను సృష్టించినట్లు తేలింది.
కేకేఆర్ దారుణ ప్రదర్శన
నిజానికి కేకేఆర్ జట్టుపై విమర్శలు రావడానికి బలమైన కారణం ఉంది. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, 2025 సీజన్‌లో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలే సాధించింది. ఇక 2026 సీజన్ మొదలయ్యాక 5 మ్యాచ్‌లు గడిచినా బోణీ కొట్టలేకపోయింది. అజింక్యా రహానే వ్యక్తిగత ఫామ్ కూడా జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచినప్పటికీ, ఫలితాలు రాకపోవడంతో సహజంగానే కెప్టెన్ మార్పుపై పుకార్లు పుట్టుకొచ్చాయి.
BREAKING NEWS
Ajinkya Rahane steps down as captain of KKR after a disaster campaign till now.
New captain to be announced soon.
Source- TrustMeBroNews pic.twitter.com/1hGJ4Disvd
— Aman.pb
(@Aman06072302) April 16, 2026
అభిమానులు అప్రమత్తంగా ఉండాలి
క్రికెట్ సీజన్ నడుస్తున్నప్పుడు ఇలాంటి ఫేక్ వార్తలు రావడం సాధారణం. ముఖ్యంగా జట్టు వరుస ఓటముల్లో ఉన్నప్పుడు కెప్టెన్ లేదా కోచ్‌పై నెగిటివ్ వార్తలు సృష్టించి వ్యూస్ పెంచుకోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. కేకేఆర్ తదుపరి మ్యాచ్‌లో రహానే సారథ్యంలోనే బరిలోకి దిగబోతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
BREAKING NEWS
(@Aman06072302)