Reading Time: 4 minutes

ఆస్తిపాస్తుల్లో ‘అగ్ర’వర్ణాలే..! ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పోలిస్తే వాళ్లకే ఎక్కువ

Caption of Image.
  • 20 ఎకరాల కన్నా ఎక్కువ భూములున్న ఓసీలు 4.4 శాతం
  • బీసీల్లో 2.9, ఎస్టీల్లో 2 శాతం మందికే ఆ స్థాయి భూములు
  • ఎస్సీల్లో కేవలం ఒకే ఒక్క శాతం మందికి 20 ఎకరాలకు పైగా భూములు
  • అద్దాల మేడలు, పెద్ద ఇండ్లున్నదీ అగ్రవర్ణాలకే..
  • వ్యాపారాలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వాళ్లదే హవా
  • సమగ్ర సర్వే రిపోర్టులో ఆసక్తికర అంశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అగ్ర కులాల వాళ్లు అన్నింట్లోనూ అగ్రస్థానంలోనే ఉన్నారు. ఆస్తిపాస్తుల్లోనూ, వ్యవసాయ భూముల్లోనూ, వ్యాపార రంగం, చదువులు ఒక్కటేమిటి.. దేంట్లోనూ తీసిపోని విధంగా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పోలిస్తే వాళ్ల జీవనశైలి చాలా బాగున్నట్టు తేటతెల్లమైంది. సమగ్ర సర్వే రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చిన్న కమతాల నుంచి పెద్ద కమతాల వరకు ఎక్కువ మొత్తంలో వారి ఆధీనంలోనే ఉన్నట్టు సర్వే తేల్చింది. 20 ఎకరాల కన్నా ఎక్కువ భూములున్నోళ్లు ఓసీల్లో అత్యధికంగా 4.4 శాతం ఉన్నట్టు వెల్లడైంది. 

బీసీల్లో 2.9 శాతం మందికి ఉంటే.. ఎస్టీల్లో 2 శాతం మందికి 20 ఎకరాలపైన భూములున్నాయి. అదే ఎస్సీల్లో కేవలం ఒకే ఒక్క శాతం మందికి ఆ స్థాయిలో భూములున్నట్టు తేలింది. అదే సమయంలో 5 ఎకరాల్లోపు భూములున్నోళ్లు ఓసీల్లోనే తక్కువున్నారు. ఎస్సీల్లో ఎక్కువున్నారు. ఎస్సీ జనాభాలో వ్యవసాయ భూములున్న వారిలో 90.5 శాతం  మందికి 5 ఎకరాల్లోపే ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ఆ తర్వాత బీసీల్లో 85 శాతం, ఎస్టీల్లో 80 శాతం మందికి 5 ఎకరాల్లోపు భూములున్నాయి. 5 ఎకరాల్లోపు కమతాలున్న వారిలో రాష్ట్ర సగటు 80 శాతమైతే.. ఓసీలు రాష్ట్ర సగటు కన్నా తక్కువే ఉండడం గమనార్హం. 

అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రం రాష్ట్ర సగటు కన్నా ఎక్కువున్నారు. తక్కువ భూములున్న వారికి కనీసం ఇరిగేషన్​ సౌలతులు లేవని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా తక్కువ ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా నష్టం జరుగుతున్నదని పేర్కొంది. 20 ఎకరాల కన్నా ఎక్కువ భూములు తరతరాలుగా అగ్రకులాల వాళ్లకే ఎక్కువగా ఉన్నాయంటూ నివేదిక తేల్చింది. 

పెద్దిండ్లూ వాళ్లవే..

పెద్ద పెద్ద ఇండ్లు, మేడలు కూడా ఓసీల్లోనే ఎక్కువున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ట్రిపుల్​ బెడ్రూం లేదా అంతకన్నా పెద్ద ఇండ్లు వారికే ఎక్కువున్నట్టు స్పష్టమైంది. ఓసీల్లో 42.8 శాతం మందికి పెద్ద ఇండ్లున్నట్టు తేలింది. అదే బీసీల్లో 28.5 శాతం మందికి, ఎస్టీల్లో 18.9 శాతం మందికి, ఎస్సీల్లో కేవలం 17.6 శాతం మందికే ట్రిపుల్​ బెడ్రూం ఇండ్లున్నట్టు వెల్లడైంది. డబుల్​ బెడ్రూం లేదా అంతకన్నా చిన్న ఇండ్లల్లోనే ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ మంది బతకాల్సి వస్తున్నది. చిన్న ఇండ్లు ఉన్న వారిలో అత్యధికంగా ఎస్టీల్లో 75.5 శాతం మంది ఉంటే.. ఆ తర్వాత ఎస్సీల్లో 73.7 శాతం మందికి చిన్న ఇండ్లు ఉన్నాయి. 

బీసీల్లో 63.9 శాతం మందికి డబుల్  బెడ్రూం కన్నా తక్కువ సైజు ఇండ్లున్నాయి. అదే సమయంలో వారితో పోలిస్తే ఓసీలకు మాత్రం కేవలం 47.4 శాతం మందికే చిన్న ఇండ్లు ఉండడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీల ఇండ్లకు కనీసం కరెంట్, టాయిలెట్ల వసతులు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. 11 శాతం మంది ఎస్టీల ఇండ్లకు కరెంట్​ లేదని రిపోర్ట్​  తేల్చింది. ఎస్సీల్లో 8.3 శాతం, బీసీలకు 4.7 శాతం ఇండ్లకు కరెంట్​ సౌకర్యాలు లేవని బయటపడింది. 

అదే సమయంలో ఓసీల్లోని కేవలం 2.7 శాతం మందికే కరెంట్​ సౌకర్యం లేనట్టు నివేదిక వెల్లడించింది. టాయిలెట్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎస్టీల్లోని 32.5 శాతం మంది ఇండ్లలో మరుగుదొడ్లు లేవని నివేదిక తేటతెల్లం చేసింది. అదే సమయంలో ఎస్సీల్లోని 18.8 శాతం, బీసీల్లోని 10.8 శాతం మందికి టాయిలెట్లు లేవని తెలిపింది. అయితే, ఓసీల్లో మాత్రం కేవలం 4.5 శాతం మందికే టాయిలెట్లు లేవని నివేదిక వెల్లడించింది. 

వ్యాపారాలు, ఉద్యోగాలూ వాళ్లవే..

ఆస్తిపాస్తులే కాదు.. వ్యాపారాలు, ఉద్యోగాల్లోనూ అగ్రకులాల వారి హవానే కొనసాగుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఓసీల జనాభా శాతం(11.9) కాగా, వ్యాపారాలు చేస్తున్న వారిలో 39 శాతం మంది వాళ్లే ఉన్నట్టు తేలింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 19 శాతం, ప్రైవేటు ఉద్యోగాల్లో 29 శాతం మంది స్థిరపడినట్టు వెల్లడైంది. అదే సమయంలో కూలీ పనికి వెళ్లే ఓసీల సంఖ్య.. వారి జనాభాతో పోలిస్తే 4 శాతం తక్కువేనని తేలింది.  బీసీల్లో మాత్రం కూలీపనికి వెళ్లే వాళ్లే ఎక్కువని తేలింది. బీసీల్లో 58 శాతం మంది కూలీ పని మీదే బతుకు వెళ్లదీస్తున్నట్టు వెల్లడైంది. వ్యాపారాల్లో వారి జనాభా వాటాలో కేవలం 53 శాతం మంది ఉన్నట్టు బయటపడింది. 

ప్రభుత్వ ఉద్యోగాల్లో 54, ప్రైవేటు ఉద్యోగాల్లో 53 శాతమని తేలింది. ఇక, ఎస్సీ, ఎస్టీల్లో వ్యాపారాలు చేసే వాళ్లు అతి తక్కువే కావడం గమనార్హం. ఎస్సీల జనాభాతో పోలిస్తే బిజినెస్​ చేస్తున్న వారు కేవలం 6 శాతమే. ప్రైవేట్​ జాబ్​లున్నది 14 శాతమని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ కొలువుల్లో మాత్రం 17 శాతం మంది ఉన్నారు. అదే సమయంలో ఎస్టీల్లో బిజినెస్​ చేస్తున్న వారి సంఖ్య వారి జనాభాతో పోలిస్తే 2 శాతమే. ప్రైవేటు జాబుల్లో 4 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం మంది ఉన్నారు.

విద్య, వైద్యం కోసం అప్పులు

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు విద్య, వైద్యం కోసం ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నారు. తమ పిల్లలను ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీల్లో చదివించడానికి, ప్రైవేట్  ఆసుపత్రుల్లో వైద్యం కోసం భారీగా అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రిలీజ్​ చేసిన సీపెక్​ సర్వే రిపోర్టులో ఆసక్తికర విషయాలున్నాయి. విద్య, వైద్య అవసరాల కోసం ఓసీలు.. కింది వర్గాలవారు చేస్తున్న అప్పుల విషయంతో భారీ వ్యత్యాసం ఉంది. 

ఎస్టీల్లో 9.7 శాతం మంది, ఎస్సీల్లో 8.8 వాతం మంది ప్రైవేట్​ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకుంటున్నట్టు రిపోర్ట్ లో వెల్లడైంది. బీసీల్లో 5.1 శాతం మంది వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకుంటుండగా.. 19.3 శాతం మంది బ్యాంకులను ఆశ్రయిస్తున్నట్టు తేలింది. ఎస్టీల్లో కేవలం 5.9 శాతం మందే బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారు. 

వైద్యానికి 12 శాతం అప్పు

అన్ని వర్గాలవారికి ఒకే తరహా ఆదాయం ఉన్నా ఇతరులతో పోలిస్తే షెడ్యూల్డ్  కులాల వారు వైద్యం కోసం నాలుగు రెట్లు ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఆర్థిక అభద్రత, ఆకస్మిక ఆరోగ్య సమస్యలు తలెత్తడం, పొదుపు లేకపోవడం అప్పులకు కారణంగా సర్వే గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని 11.5 శాతం కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాల్లోని 10.2 శాతం కుటుంబాలు వైద్య అవసరాల కోసం అప్పులు తీసుకున్నట్లు చెప్పాయి. పట్టణాల్లో 17.3 శాతం ఎస్సీ కుటుంబాలు, 12.4 శాతం బీసీ, 12.6 శాతం ఎస్టీ కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పులు తీసుకుంటున్నాయి. 

ఓసీల్లో కేవలం 4.9 శాతం మంది మాత్రమే అప్పు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15.9 శాతం ఎస్సీలు అప్పులు తీసుకుంటుంటే ఓసీల్లో 4.7 శాతం మంది మాత్రం అప్పులు చేస్తున్నారు. ఓసీ సామాజికవర్గానికి చెందిన జైనుల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే రుణాలపై ఆధారపడ్డారని తేలింది. జిల్లాల వారీగా చూస్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 32.1 శాతం, జగిత్యాల జిల్లాలో 28.2 శాతం, సిరిసిల్ల జిల్లాలో 26.9 శాతం ఎస్సీ కుటుంబాలు వైద్య రుణాలు తీసుకోగా, ఓసీల్లో 10 శాతం మందే తీసుకున్నట్టు రిపోర్ట్  
పేర్కొంది. 

విద్యలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు 

విద్య విషయంలో ఓసీల కంటే ఎస్సీ, ఎస్టీలు 3 రెట్లు, బీసీలు 2.7 రెట్లు వెనుకబడినట్టు రిపోర్ట్​ చెప్తోంది. ఓసీల్లో 66.3 శాతం మంది ఇంగ్లీష్​ మీడియంలో చదువుతుంటే ఎస్సీలలో 40.7 శాతం, ఎస్టీలలో 36.6 శాతం, బీసీల్లో 48 శాతం మంది చదువుతున్నారు. ​ డ్రాపవుట్​ సంఖ్య కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 3 రెట్లు ఎక్కువ ఉంది. 

విద్య కోసం 10 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు అప్పులపై ఆధారపడుతున్నాయి. రోజువారీ కూలీ, వ్యవసాయ కూలీ, ఇతర వృత్తుల్లో ఉన్న కుటుంబాల్లో డ్రాపవుట్​ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తేలింది. భూమిలేని వారు, పేదలు ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తున్నట్టు రిపోర్ట్ పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.