Reading Time: 2 minutes
Afghanistan Villagers Gold Panning Kunar River Economic Crisis

ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణులు చూడటానికి చాలా అందంగా, గంభీరంగా కనిపిస్తాయి. కానీ ఆ పర్వతాల నీడలో నివసించే ప్రజల జీవితాలు మాత్రం చాలా భారంగా గడుస్తున్నాయి. దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం కారణంగా ఉపాధి అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పెరిగిన ధరలు, తక్కువ వేతనాలతో సామాన్యులు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో అక్కడి గ్రామస్థులకు ప్రకృతి ప్రసాదించిన ‘కునార్’ నది ఒక ఆశాదీపంగా మారింది. నది ఒడ్డున దొరికే చిన్న చిన్న బంగారు రేణువులే ఇప్పుడు వందలాది కుటుంబాలకు ప్రాణాధారమయ్యాయి. ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకపోయినా, కేవలం తమ శ్రమనే నమ్ముకుని వారు చేస్తున్న ఈ ప్రయత్నం వారి ఆకలి తీరుస్తోంది.

Also Read:No Rain-No Gain: వానలు పడితే స్టాక్ మార్కెట్ పరుగులు.. వర్షానికి, స్టాక్ మార్కెట్‌కు సంబంధం ఏంటి..?

కునార్ ప్రావిన్స్‌లోని ఖర్వాలు గ్రామం వద్ద దృశ్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏప్రిల్ నెలలో కూడా మంచుతో కప్పబడిన కొండల మధ్య, వందలాది మంది పురుషులు నది గర్భాన్ని తవ్వుతూ కనిపిస్తారు. కాబూల్‌లో భవన నిర్మాణ రంగంలో పనిచేసే 45 ఏళ్ల దెలావర్, అక్కడ పని లేక ఇక్కడికి చేరుకున్నాడు. ఎనిమిది మంది పిల్లలున్న దెలావర్‌కు ఈ బంగారు వేటే ఇప్పుడు జీవనాధారం. “దేశంలో ఉద్యోగాలు లేవు, అందుకే మాకు మేమే ఈ పనిని సృష్టించుకున్నాం” అని ఆయన అంటున్నాడు.

Also Read:Credit Cards: మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయా… అయితే సిబిల్ స్కోర్ ఢమాల్..?

ఇక్కడ దొరికే బంగారం ముక్కలు గోధుమ గింజ కంటే చిన్నవిగా ఉంటాయి. వీటిని సేకరించడం ఒక పెద్ద యుద్ధమే. పారలతో మట్టిని తవ్వి, జల్లెడ పట్టి, నది నీటితో పదేపదే కడిగితే కానీ ఆ మెరిసే రేణువులు దొరకవు. కొందరు కొండ చరియలను పగులగొట్టి బస్తాలతో మట్టిని మోసుకొచ్చి వడకడుతుంటారు.

35 ఏళ్ల గుల్ అహ్మద్ జాన్ అనే వ్యక్తి చెప్తున్న దాని ప్రకారం.. వారం రోజుల పాటు కష్టపడితే దాదాపు ఒక గ్రాము బంగారం దొరుకుతుంది. దీని విలువ సుమారు 8,000 ఆఫ్ఘానీలు (దాదాపు 125 డాలర్లు). దేశంలోని ఇతర పనులతో పోలిస్తే ఇది మెరుగైన ఆదాయమే. ఆఫ్ఘనిస్థాన్‌లో అపారమైన సహజ సంపద ఉన్నప్పటికీ, యుద్ధాల వల్ల అది ఎప్పుడూ వినియోగంలోకి రాలేదు. కానీ ఇప్పుడు ఆకలి తీర్చుకోవడానికి ఈ నిరుపేదలే తమ సొంత మార్గాలను వెతుక్కుంటున్నారు.