
Vaibhav Suryavanshi : భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్‌లో బుమ్రా, బోల్ట్ వంటి దిగ్గజ బౌలర్లనే భయపెట్టిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా డెబ్యూకు సిద్ధమవుతున్నాడు. జూన్‌లో జరగబోయే ఐర్లాండ్ పర్యటన కోసం షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్లలో వైభవ్ పేరు ఉండటంతో చర్చ మొదలైంది. అయితే, ఒక అద్భుతం జట్టులోకి రావాలంటే ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. మరి వైభవ్ కోసం ఎవరి సీటు డేంజర్లో ఉంది? కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి? విషయాలు తెలుసుకుందాం.
ఐర్లాండ్ పర్యటన – వీసా ప్రక్రియ షురూ
భారత జట్టు జూన్ నెలలో ఐర్లాండ్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన కూడా ఉంది. అయితే ఐర్లాండ్ సిరీస్ కోసం సెలక్టర్లు ఇప్పటికే 35 మంది ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ లాజిస్టిక్స్ విభాగానికి పంపారు. ఇందులో వైభవ్ సూర్యవంశీ పేరు ఉండటం విశేషం. వీరందరికీ వీసా ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా సెలక్టర్లు కోరారు. సాధారణంగా 15 మందితో ఉండే జట్టును ఈసారి 16 లేదా 17 మందికి పెంచాలని యోచిస్తున్నారు. అయితే, స్క్వాడ్‌లో ఉండటం వేరు.. తుది జట్టులో (Playing 11) చోటు సంపాదించడం వేరు.
వైభవ్ వస్తే ఎవరికి కౌంట్ డౌన్?
ప్రస్తుతం టీమిండియా టీ20 ఓపెనింగ్ స్లాట్ కోసం విపరీతమైన పోటీ ఉంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఈ ముగ్గురూ టీ20 వరల్డ్ కప్ 2026లో అదరగొట్టారు. సంజూ అయితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు, అభిషేక్ నంబర్-1 బ్యాటర్. వీరితో పాటు యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడు. ఇప్పుడు వైభవ్‌ను ఓపెనర్‌గా తీసుకుంటే, వీరిలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ ఫైనల్‌లో హాఫ్ సెంచరీలు చేసిన వీరిని ఏ కారణం చెప్పి తప్పిస్తారన్నది సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది.
సూర్యకుమార్ యాదవ్ పొజిషన్‌పై చర్చ
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్నాడు. ఒకవేళ వైభవ్ కోసం సంజూ లేదా అభిషేక్ వంటి ఇన్-ఫామ్ ఆటగాళ్లను పక్కన పెడితే, ఫామ్ లో లేని సూర్యకుమార్ జట్టులో ఎలా కొనసాగుతారని అభిమానులు ప్రశ్నించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వైభవ్ రాక కేవలం ఓపెనర్లకే కాదు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు, ముఖ్యంగా కెప్టెన్ సీటుకే ఎసరు పెట్టేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డెబ్యూ ఎప్పుడు? ఐర్లాండ్ లోనా లేక ఆసియా క్రీడల్లోనా?
వైభవ్ సూర్యవంశీ కేవలం ఐర్లాండ్ సిరీస్ మాత్రమే కాదు.. ఆ తర్వాత జరిగే జింబాబ్వే పర్యటన, వెస్టిండీస్ హోమ్ సిరీస్ లేదా జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ (Asian Games) రేసులో కూడా ఉన్నాడు. ఒకే సమయంలో రెండు వేర్వేరు సిరీస్‌లు జరిగితే, భారత్ రెండు జట్లను తయారు చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వైభవ్‌కు డెబ్యూ ఖాయమని తెలుస్తోంది. ఏది ఏమైనా, చిన్న వయసులోనే బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ కుర్రాడు.. టీమిండియా జెర్సీలో ఎప్పుడు కనిపిస్తాడా అని దేశమంతా ఎదురుచూస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..