
పెనుబల్లి/ కల్లూరు/ సత్తుపల్లి/ దమ్మపేట, వెలుగు : పులిగుండాల ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుపుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. బుధవారం ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లి మండలాల్లో పర్యటించారు. ముందుగా పెనుబల్లి మండలం కనకగిరి అటవీ ప్రాంతంలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసిన బోటింగ్, వాటర్ ఫాల్స్, జంగిల్‌సఫారీ, కాటేజీలను బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీసీఎఫ్ భీమానాయక్‌తో కలిసి ప్రారంభించారు.
తుమ్మలపల్లిలో నిర్మించనున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ రిపేరు సెంటర్ కు శంకుస్థాపన చేసి, పెనుబల్లిలో నూతనంగా నిర్మించిన 30పడకల హాస్పటల్ బిల్డింగ్ ను ప్రారంభించారు. కల్లూరు మండలంలోని నారాయణపురంలో నిర్మించనున్న 33/11 కేవీ సబ్స్టేషన్పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ కేంద్రంలో వైద్య విధాన పరిషత్‌కు చెందిన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు. సత్తుపల్లిలో రూ.34 కోట్లతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని డిప్యూటీ సీఎం, మంత్రి ప్రారంభించారు.
ఆయా కార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, పీసీసీఎఫ్ సువర్ణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సీపీ సునీల్ దత్, డీఎఫ్‌వో సిద్ధార్ధ విక్రమ్ సింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి శంకుస్థాపన చేశారు. గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నివాసంలో తేనేటి విందులో పాల్గొన్న అనంతరం మోడల్ సోలార్ విలేజ్ ప్రాజెక్ట్ ను ఆయన సందర్శించారు.
ఎకో టూరిజంతో ఉపాధి..
ఖమ్మం జిల్లాల్లో పర్యటనల్లో ఆయా కార్యక్రమాలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ పులిగుండాల ప్రాజెక్ట్‌కు ఇరువైపులా కాటేజీల నిర్మాణానికి రూ.4 కోట్ల సీఎస్‌ఆర్ నిధుల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏకో టూరిజం అభివృద్ధితో ఈ ప్రాంతంలో ఉండే గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. విద్య, వైద్య రంగాల్లో భారీ పెట్టుబడులతో ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు 14 వేల అదనపు పడకలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజలు కూడా విద్యను అందుకోవాలని లక్ష్యంతో ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడ్వాన్స్ సెంటర్లను దానికి అనుసంధానం చేస్తున్నట్టు చెప్పారు. ఖమ్మం జిల్లా వ్యవసాయ ఆధారితమైన జిల్లా అని, ప్రభుత్వం పెద్ద ఎత్తున నీటి వసతి కల్పించడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టిందని, ప్రస్తుతం జిల్లాలో 3,40,000 ఎకరాలకు ఆయకట్టు ఉంటే, అదనంగా మరో 3.16 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రభుత్వం రూ.2500 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
ప్రతి పేదవాడికి వైద్యం..
అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పులిగుండాలను రాష్ట్రంలోని మొదటి మూడు ఉత్తమ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలబెడతామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి పులిగుండాలకు నీటిని మళ్లించే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి వైద్యానికి, విద్యకు ఎటువంటి లోటు రాకూడదనీ, ధనికులకు ఎటువంటి వైద్యం, విద్య అందుతున్నాయో, అటువంటి విద్య, వైద్యం పేదలకు అందాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే కల్లూరులో 50 పడకలు, పెనుబల్లి 30 పడకలు, సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.