
హుజూరాబాద్, వెలుగు : ఓ కాంట్రాక్టర్‌కు రావాల్సిన బిల్లులకు సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చేందుకు లంచం తీసుకున్న హుజూరాబాద్ మున్సిపల్ ఏఈని ఏసీబీ ఆఫీసర్లు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓ కాంట్రాక్టర్ కాల్వ పనులను పూర్తి చేశాడు. ఈ పనులకు సంబంధించిన బిల్లు రావాల్సి ఉండడంతో అసిస్టెంట్ ఇంజినీర్ నుసుం సుధాకర్‌రెడ్డిని కలిశాడు. బిల్లు ఫైనల్ ప్రాసెస్ చేయాలన్నా, వివరాలు మెజర్‌మెంట్ బుక్‌లో నమోదు చేయాలన్నా రూ. 50 వేలు ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు.
దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో బుధవారం హుజూరాబాద్‌లోని ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద ఉన్న ఏఈని కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు ఏఈ సుధాకర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకొని, ఏఈని కరీంనగర్‌లోని స్పెషల్‌జడ్జి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు.