Reading Time: 5 minutes

అగాధమంత అసమానత.. అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు వెనుకబడే!

Caption of Image.
  • 242 కులాల్లో ‘అత్యంత వెనుకబడినవి’ 135
  • 78% గృహాల వార్షిక ఆదాయం ‘లక్ష’ లోపే!
  • సంక్షేమంలోనూ 30 శాతం నిధులు సంపన్న కులాలకే
  • కులవృత్తులకు ‘రాం రాం’.. బతుకుదెరువు కోసం 70% ప్రత్యామ్నాయం వైపే
  • గల్ఫ్ బాటలో తెలంగాణ పల్లె..42 శాతం మంది 
  • ఆ దేశాలకే.. ఉపాధి వలసల్లో బీసీ, ఎస్సీలే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు అగ్రవర్ణాల కంటే మూడు రెట్లు ఎక్కువ వెనుకబడి ఉన్నారని నివేదిక వెల్లడించింది. బీసీలు కూడా అగ్రవర్ణాల కంటే 2.7 రెట్లు వెనుకబడి ఉన్నారు. మొత్తం 242 కులాల్లో 135 కులాలను ‘అత్యంత వెనుకబడినవి’గా గుర్తించారు. ఈ 135 కులాల్లోనే రాష్ట్ర జనాభాలో 67 శాతం మంది ఉన్నారు. ఈ కులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ వెనుకబడి ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఎస్టీల్లో 99 శాతం, ఎస్సీల్లో 97 శాతం, బీసీల్లో 71 శాతం మంది ప్రజలు రాష్ట్ర సగటు కంటే వెనుకబడి ఉండటం ఆందోళన కలిగించే అంశం. మరోవైపు, అగ్రవర్ణాలకు చెందిన 18 కులాలూ రాష్ట్ర సగటు కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నాయని సీబీఐ ర్యాంకింగ్స్ స్పష్టం చేశాయి.

2024లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాల్లో ఈ విషయం స్పష్టం చేసింది. దీనిపై స్టడీ చేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నిపుణుల బృందం సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ ఉపాధి వంటి ఐదు కీలక రంగాల్లో ఆయా కులాల స్థితిగతులను నిశితంగా విశ్లేషించింది. ఒక కులానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ప్రాతినిధ్యం, భూమి, ఆస్తుల యాజమాన్యం, ఉన్నత విద్యావంతుల శాతం, తలసరి ఆదాయం రాజకీయ పదవుల్లో వారి వాటా వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ మార్కులను కేటాయించారు.

ఈ సూచీలో స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే ఆ కులం అంతటి తీవ్రమైన వెనుకబాటుతనంలో మగ్గుతున్నట్లు లెక్క. ఉదాహరణకు డక్కలి (116), పిచ్చిగుంట్ల (110), సింధోళ్లు (112) వంటి కులాలకు అత్యధిక స్కోరు రావడం వారు అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్నారనే చేదు నిజాన్ని వెల్లడిస్తున్నది. మరోవైపు ఓసీ వర్గాలైన రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు 12 నుంచి 30 లోపు స్కోరు రావడమనేది వారి సామాజిక ఉన్నతిని అభివృద్ధిని సూచిస్తోంది.

దినసరి కూలీలుగానే అట్టడుగు వర్గాలు
ఉపాధి రంగంలో కుల వ్యవస్థ ప్రభావం ఇంకా బలంగా ఉందని సర్వే నివేదిక పేర్కొంది. ఎస్సీ వర్గాల్లో దాదాపు సగం మంది (45.7%) దినసరి కూలీలుగానే జీవితం వెళ్లదీస్తుండగా, అగ్రవర్ణాల్లో ఈ శాతం కేవలం 10.9 మాత్రమే. అలాగే వ్యవసాయ కూలీలుగా ఎస్టీలు 32.2 శాతం, ఎస్సీలు 31.7 శాతం మంది పనిచేస్తుంటే, అగ్రవర్ణాల వారు కేవలం 5.5 శాతం మంది మాత్రమే ఆ రంగంలో ఉన్నారు. దీనికి భిన్నంగా, ప్రైవేటు రంగంలో ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో అగ్రవర్ణాల వారు 14.8 శాతంతో పైచేయి సాధించగా, ఎస్టీలు కేవలం 2.8 శాతంతో అట్టడుగున ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం రిజర్వేషన్ల వల్ల కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, ప్రైవేటు రంగంలో మాత్రం వెనుకబాటు కొనసాగుతోంది.

ఎస్టీలకు భూమి ఉన్నా సాగునీరు నిరాశే
భూమి యాజమాన్యం విషయంలో ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఎస్టీల్లో 58.1 శాతం మందికి భూమి ఉన్నప్పటికీ, అది ఎక్కువగా మెట్ట భూమి కావడంతో వారి ఆదాయం పెరగడం లేదు. అగ్రవర్ణాలకు కేవలం 33.7 శాతం మందికే భూమి ఉన్నా, పెద్ద కమతాలు (>20 ఎకరాలు) వారి వద్దే ఎక్కువగా ఉన్నాయి. 20 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న కుటుంబాల్లో అగ్రవర్ణాల వారు 4.4 శాతం ఉంటే, ఎస్సీలు కేవలం 1 శాతం ఉన్నారు. సాగునీటి సౌకర్యం ఉన్న భూమి బీసీల వద్ద (45.9%) కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎస్సీ, ఎస్టీల వద్ద భూమి తక్కువగా ఉండటంతో వారు కూలీలుగానే మిగిలిపోతున్నారు.

సౌకర్యాల లేమిలో గిరిజన ప్రాంతాలు
మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం ఇంకా చాలా దూరం ప్రయాణించాలని సర్వే గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర సగటున 13.3 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు, కానీ ఎస్టీలలో ఈ శాతం ఏకంగా 32.5గా ఉండటం గమనార్హం. అలాగే విద్యుత్ సౌకర్యం లేని కుటుంబాల్లో ఎస్టీలే అత్యధికంగా (11%) ఉన్నారు. నల్లా నీటి సౌకర్యం లేని ఇళ్లు ఎస్టీల్లో 29.2 శాతంగా ఉండగా, అగ్రవర్ణాల్లో ఇది కేవలం 12.8 శాతమే. రెండు లేదా అంతకంటే తక్కువ గదులున్న చిన్న ఇళ్లలో 75.5 శాతం మంది ఎస్టీలు నివసిస్తుండటం వారి జీవన ప్రమాణాలు దయనీయస్థితికి అద్దం పడుతున్నాయి. ఆధునిక విలాస వస్తువులైన కార్లు, ఫ్రిడ్జ్‌ల వినియోగంలో అగ్రవర్ణాలే అగ్రస్థానంలో ఉన్నాయి.

ఎవరికి ఎంత దక్కుతోంది?
రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు కేటాయించే మొత్తంలో 30 శాతం నిధులు రాష్ట్ర సగటు కంటే తక్కువ వెనుకబాటుతనం ఉన్న (సంపన్న) కులాలకే చేరుతున్నాయని నివేదిక సంచలన వ్యాఖ్య చేసింది. వ్యవసాయ ఆధారిత పథకాలైన రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి వాటిలో భూమి ఎక్కువగా ఉన్న అగ్రవర్ణాలే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఉదాహరణకు రైతు భరోసా లబ్ధిదారుల్లో అగ్రవర్ణాల వారు 15 శాతం ఉంటే, ఎస్సీలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల్లో ఎస్సీ మహిళలు (20%) అధికంగా లబ్ధి పొందుతున్నారు. సంక్షేమ పథకాలు నిజమైన వెనుకబడిన వర్గాలకు చేరాలంటే విధివిధానాల్లో మార్పులు రావాలని నివేదిక సూచించింది.

మహిళల విద్యలో వెనుకబాటు
మహిళల స్థితిగతులపైనా ఈ నివేదిక కీలక అం శాలను వెల్లడించింది. రాష్ట్రంలో 65.5 % మంది మహిళలు పదో తరగతి కూడా దాటలేదు. ఎస్టీ మహి ళల్లో ఈ వెనుకబాటుతనం 72.3 శాతంగా ఉండటం శోచనీయం. బాల్య వివాహాల విషయంలో కూడా ఆందో ళనకర పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 2.16 లక్షల మంది బాలికలకు 18 ఏళ్లలోపే పెళ్లవుతోంది. విచిత్రంగా అగ్రవర్ణాలైన అయ్యంగార్లు/అయ్యర్లలో ఈ శాతం ఎక్కువగా (21.2%) ఉండటం నిపుణులను ఆశ్చర్యపరిచింది. లింగ నిష్పత్తి ఎస్సీల్లో మెరుగ్గా (101.0%) ఉండగా, అగ్రవర్ణాల్లో (97.6%) తక్కువగా ఉంది. 

కులవృత్తులను వదిలేసిన్రు
తెలంగాణలో కుల వృత్తులపై ఆధారపడటం క్రమంగా తగ్గుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది. సుమారు 69.6 శాతం మంది తమ సంప్రదాయ కుల వృత్తులను  వదులుకుని ఇతర రంగాల్లోకి మారారు. కేవలం 30.4 శాతం మంది మాత్రమే ఇంకా కుల వృత్తులపైనే ఆధారపడుతున్నారు. కుల వృత్తులను వదులుకున్న వారిలో అగ్రవర్ణాల వారు 85.6 శాతంతో ముందుండగా, బీసీలు 61.3 శాతం మంది ఉన్నారు. ఎస్సీల్లో 71.4 శాతం, ఎస్టీల్లో 87 శాతం మంది కుల వృత్తులను వీడి దినసరి కూలీలుగా లేదా ఇతర పనుల్లో స్థిరపడ్డారు.

ముఖ్యంగా పట్టణీకరణ వల్ల యువత కుల వృత్తుల పట్ల ఆసక్తి చూపడం లేదు. కుల వృత్తులను ఇంకా కొనసాగిస్తున్న వారిలో బీసీ వర్గాలు 38.7 శాతంతో మెజారిటీగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుల వృత్తుల ప్రభావం దాదాపు 81.5 శాతం మేర తగ్గింది. ఈ ధోరణి సామాజిక గమనశీలతను  ఆర్థిక మార్పులను సూచిస్తోంది. సాంప్రదాయ వృత్తుల నుంచి ఆధునిక వృత్తుల వైపు మళ్లుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది.

ఉపాధి కోసం మహారాష్ట్ర, కర్నాటకకు బతుకుదెరువు కోసం తెలంగాణ నుంచి వలసలు వెళ్లే వారి శాతం 1.1గా ఉంది. ఇలా వలస వెళ్లిన వారిలో 60.4 శాతం మంది ఇతర దేశాలకు  వెళ్లగా, 39.6 శాతం మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. విదేశాలకు వెళ్లిన వారిలో 42 శాతం మంది గల్ఫ్ దేశాలకే వెళ్లడం గమనార్హం. అమెరికాకు వెళ్లిన వారి వాటా 17.8 శాతంగా ఉంది. బ్రిటన్  కు 14.5 శాతం మంది, ఆస్ట్రేలియాకు 2.6 శాతం మంది వెళ్లారు. 

యూరప్ దేశాలకు 7.6 శాతం మంది ఉపాధి కోసం వెళ్లారు. వలసలు ఎక్కువగా జగిత్యాల (3.8%)  నిజామాబాద్ (2.5%) జిల్లాల నుంచి ఉన్నాయి. గల్ఫ్ వలసల్లో బీసీ వర్గాల వాటా 52.6 శాతం కాగా, ఎస్సీల వాటా 61.1 శాతంగా ఉంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారిలో అగ్రవర్ణాల వారు 37.6 శాతంతో ముందున్నారు. ఈ డేటా ప్రకారం ఉత్తర తెలంగాణ నుంచి వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. పేదరికం నిరుద్యోగం వలసలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

ప్రజలు వలస వెళ్లడానికి ప్రధాన కారణం ఉద్యోగం/ఉపాధి అని సర్వే వెల్లడించింది. సుమారు 29.1 శాతం మంది ఉపాధి కోసమే వలస వెళ్లగా, 20.5 శాతం మంది ఉన్నత చదువుల  కోసం వెళ్లారు. వ్యాపారాల నిమిత్తం 3.1 శాతం మంది వలస బాట పట్టారు. చదువు కోసం విదేశాలకు వెళ్లే వారిలో అమెరికా (17.8%)  బ్రిటన్ (14.5%) ప్రధాన గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారిలో మహారాష్ట్ర,  కర్నాటక వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 

విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలలో 30 శాతం మంది ఉపాధి కోసమే వెళ్తున్నారు. అగ్రవర్ణాలలో చదువు కోసం వెళ్లే వారి శాతం 43.8గా ఉండటం గమనార్హం. పట్టణ ప్రాంత యువత ఎక్కువగా ఉన్నత చదువుల కోసం, గ్రామీణ యువత ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. ఈ గణాంకాలు రాష్ట్రంలోని ఉపాధి కల్పన  విద్యా వసతుల స్థాయిని సూచిస్తున్నాయి. వలస కార్మికుల సంరక్షణ కోసం ప్రత్యేక విధానాల అవసరమని ఈ నివేదిక వెల్లడించింది.

అగ్రవర్ణాల్లో ప్రైవేటు చదువులు.. ఎస్సీ ఎస్టీలు సర్కార్ బడులకే..
విద్యారంగంలో సామాజిక వర్గాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని నివేదిక ఎత్తిచూపింది. అగ్రవర్ణాలకు చెందిన పిల్లల్లో 34 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతుండగా, ఎస్సీల్లో 15 శాతం, ఎస్టీల్లో కేవలం 13 శాతం మందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతోంది. ఉన్నత విద్య (డిప్లొమా  అంతకంటే ఎక్కువ) సాధించిన వారిలో అగ్రవర్ణాల వారు 57 శాతంతో ముందుండగా, ఎస్టీలు కేవలం 31 శాతంతో వెనుకబడి ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యలోనూ అగ్రవర్ణాల యువత 66 శాతంతో దూసుకుపోతుండగా, ఎస్టీ యువత 36 శాతానికే పరిమితమైంది. ఈ విద్యా అసమానతలే భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వెనుకబాటుకు పునాది వేస్తున్నాయి.

రూ. లక్షలోపే 78.2 శాతం కుటుంబాల ఆదాయం
తెలంగాణలోని 78.2 శాతం కుటుంబాల వార్షిక ఆదాయం లక్ష కంటే తక్కువగానే ఉందని నివేదిక విస్తుపోయే నిజం చెప్పింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే, ఎస్టీల్లో 88.2 శాతం, ఎస్సీల్లో 86.2 శాతం కుటుంబాలు ఈ పేదరికపు కోరల్లోనే చిక్కు కుని ఉన్నాయి. 

అదే సమయంలో అగ్రవర్ణాల్లో దాదాపు సగం మంది అంటే 43.8 శాతం కుటుం బాలు లక్ష కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నా యి. రూ. 5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిలో అగ్రవర్ణాల వారు 13.2 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఎస్సీ, ఎస్టీలు కేవలం 2.1 శాతం మాత్రమే ఉన్నారు. ఇన్‌కమ్ టాక్స్ కడుతున్న వారిలో 23.5 శాతం మంది అగ్రవర్ణాల వారే కావడం ఆర్థిక కేంద్రీకరణను సూచిస్తోంది. 

వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్న పేదలు
ఆర్థిక అత్యవసరాల కోసం పేద వర్గాలు ఇంకా ప్రైవే టు వడ్డీ వ్యాపారుల పైనే ఆధారపడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఎస్టీల్లో 9.7 శాతం, ఎస్సీల్లో 8.8 శాతం కుటుంబాలు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకున్నాయి. అగ్రవర్ణాల్లో ఈ శాతం కేవలం 5.1 మాత్రమే. ముఖ్యంగా వివాహాలు, ఆరోగ్య సమస్యల కోసం తీసుకునే రుణాల్లో ఎస్సీలు (10.9%) అగ్రస్థానంలో ఉన్నారు. 

సంస్థాగత పరపతి (బ్యాంకులు) అందకపోవడం, పొదుపు లేకపోవడం వల్ల ఈ వర్గాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి రావడం ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.