Reading Time: 2 minutes

లక్నో బ్యాటర్లని హడలెత్తించిన ఆర్సీబీ బౌలర్లు.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే?

Caption of Image.

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం అంటేనే పరుగుల వరద.. కానీ నేడు మాత్రం ఆర్‌సీబీ బౌలర్లు లక్నో సూపర్ జయంట్స్‌ను తమ బౌలింగ్ మాయాజాలంతో కట్టడి చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ యువ బౌలర్ రాసిఖ్ సలామ్ నిప్పులు చెరిగే బంతులతో లక్నో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 4 వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా తన అనుభవాన్ని రంగరించి 3 వికెట్లతో లక్నో మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. కృనాల్ పాండ్యా రెండు కీలక వికెట్లు తీయగా, జట్టులోకి తిరిగి వచ్చిన హాజిల్‌వుడ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో అత్యంత దురదృష్టకరమైన ఘట్టం కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడటం. హాజిల్‌వుడ్ వేసిన బంతి తగలడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్, మళ్ళీ బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోని (38) కాసేపు పోరాడినప్పటికీ, లోయర్ ఆర్డర్‌లో ముకుల్ చౌదరి (39) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ (1), అబ్దుల్ సమద్ (0), మొహమ్మద్ షమీ(0), అవేష్ ఖాన్(1)  మరోసారి దారుణంగా విఫలమయ్యారు. 

ఆర్‌సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ (4/24), భువనేశ్వర్ కుమార్ (3/28), కృనాల్ పాండ్యా (2/20) చెలరేగారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఆర్సీబీకి ఈ టార్గెట్ చాలా చిన్నది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. ఈ ఛేజింగ్ నల్లేరుపై నడకే అనిపిస్తోంది. కానీ లక్నో బౌలర్లు మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్ ప్రారంభంలో వికెట్లు తీసి ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.