Reading Time: < 1 minute

పక్షవాతంతో మంచాన పడిన తల్లి.. నాలుగో అంతస్తు పై నుంచి తోసి చంపేసిన కొడుకు !

Caption of Image.

బెంగళూరు: నవ మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని నాలుగో అంతస్తు మీద నుంచి కిందకు తోసేసి చంపేసిన ఒక కిరాతక కొడుకు ఉదంతం బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు సిటీలోని ఆర్ఆర్ నగర్లో ఉన్న BEML లేఔట్లో వెంకటేష్ అనే అతను కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని వయసు 42 సంవత్సరాలు. అతని తల్లి సావిత్రమ్మ వయసు 72 సంవత్సరాలు. ఆమె దురదృష్టవశాత్తూ నాలుగైదు సంవత్సరాల క్రితం పక్షవాతం బారిన పడింది. అప్పటి నుంచి మంచంలోనే  పడి ఉంది. అతని తల్లి అనారోగ్యం కారణంగా ఆమెకు సేవలు చేయలేక విసిగిపోయిన వెంకటేష్ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.

ఇంట్లో ఆర్థిక సమస్యలు, తల్లి అనారోగ్యం.. ఈ పరిణామాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన వెంకటేష్ తన తల్లిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తను నివాసం ఉంటున్న నాలుగో అంతస్తు మీద నుంచి కన్న తల్లిని కిందకు తోసేశాడు. అంత పై నుంచి కింద పడిపోవడంతో సావిత్రమ్మ స్పాట్లోనే చాలా రక్తం పోయి.. తీవ్రంగా గాయపడి చనిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

వెంకటేష్ మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు పోలీసులు అతనికి వైద్య పరీక్షలు చేయించారు. కన్న కొడుకుకే తల్లి భారమైపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి BEML లేఔట్లో నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. కని పెంచిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో చేదోడువాదోడుగా ఉండాల్సిన కన్న బిడ్డలు ఇలా కాటికి సాగనంపుతున్న ఘటనలు మానవ సంబంధాలు, అనుబంధాలనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.