
అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతున్న వేళ ప్రపంచ మార్కెట్లతో పాటు భారత ఈక్విటీలు కూడా లాభాల జోరు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే రెండు వారాల పాటు కాల్పుల విరమణ అమలులో ఉండగా.. చర్చల్లో పురోగతితో మరో రెండు వారాలు పొడిగించాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తలతో ఇన్వెస్టర్లలో నమ్మకం బలపడుతోంది. దీనికి తోడు అటూఇటుగా యుద్ధం ముగిసినట్లే అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన పోస్ట్ పెట్టుబడిదారులకు పెద్ద ఊరటను కలిగిస్తోంది.
ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో స్టార్ట్ అవగా చివరి వరకూ అదే జోష్ కొనసాగింది. దీంతో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 1263 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 697 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1264 పాయింట్లు పెరిగాయి. దీంతో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు యుద్ధం సమయంలోని నష్టాల నుంచి ప్రస్తుతం రికవర్ అవుతున్నాయి.
ఇరాన్ కూడా సానుకూలంగా చర్చలకు ముందుకొస్తుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా 100 డాలర్ల దిగువకు చేరుకోవటం మార్కెట్లలో ఆందోళనలను తగ్గిస్తోంది. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా వస్తున్న సానుకూల సంకేతాలు.. కంపెనీలు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన వంటి అంశాలు బుల్ జోర్ నింపుతోంది దేశీయ మార్కెట్లలో.