
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఖైరతాబాద్, అంబర్ పేట్, అల్వాల్లో మీసేవ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పౌర సేవ పత్రాల జారీలో దళారుల ద్వారా మీసేవ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బుధవారం (ఏప్రిల్ 15) ఏసీబీ రంగంలోకి దిగింది. సోదాల్లో భాగంగా మీసేవ సిబ్బంది ప్రజలను ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మీ సేవల్లో దోపీడి ఎక్కువైపోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చార్జీల పేరుతో మీసేవ సిబ్బంది చేస్తోన్న దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోయిందని జనం ఆరోపిస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో కుల, ఆదాయ, నివాస, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం వెళ్తే దోచుకుంటున్నారు. టెక్నాలజీతో పౌర సేవలను మరింత సులభతరం చేస్తున్నామంటూ అన్ని సేవలను మీ సేవ కేంద్రాలకు అప్పగించి అధికారులు మాత్రం చేతులు దులుపుకుంటున్నారు.
దీంతో నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. కుల, ఆదాయ, నివాస, కుటుంబసభ్యుల ధ్రువీకరణ, ఓబీసీ తదితర సర్టిఫికెట్ల కోసం రూ. 45 చెల్లిస్తే చాలు. కానీ, ఈ ఫీజు ఎక్కడా తీసుకోవడం లేదు. దాదాపు రూ.500 నుంచి రూ.1000 వరకు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు అప్లై చేసేప్పుడు కాకుండా తిరిగి సర్టిఫికెట్లు ప్రింట్ తీసుకునే టైంలో అదనంగా కలెక్ట్ చేస్తున్నారని దరఖాస్తుదారులు చెప్తున్నారు.
అఫిడవిట్ పేరిట..
క్యాస్ట్, లోకల్, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ కోసం అఫిడవిట్ సమర్పించాలనే నిబంధనలున్నాయి. అయితే, ఇది హైదరాబాద్ జిల్లా మినహా మిగతా జిల్లాల్లో తప్పనిసరి అనే రూలేవు. హైదరాబాద్ జిల్లాలో కూడా ఇదివరకు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకొని ఉంటే ఆ సర్టిఫికెట్ ఆధారంగా మళ్లీ అప్లై చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. కానీ, మీ సేవలో మాత్రం అదేమీ కుదరదని, అఫిడవిట్ కచ్చితంగా కావాల్సిందేనని వందల్లో వసూళ్లు చేస్తున్నారు.
చార్జీల బోర్డులు ఎక్కడ..?
మీ సేవ కేంద్రాల్లో తప్పనిసరిగా సర్వీసులకు సంబంధించిన ధరల పట్టిక(సిటిజన్ చార్ట్) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ చాలా చోట్ల స్పష్టమైన సమాచారంతో చార్ట్ ఏర్పాటు చేయడంలేదు. ఒకవేళ చార్ట్ పెట్టినా ఆ ధరలు కనిపించకుండా చిన్న అక్షరాలతో మొక్కబడిగా ఏర్పాటు చేస్తున్నారు.
1100 కు ఫిర్యాదు చేయండి
మీసేవ నిర్వాహకులు అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని మీ సేవకు సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తున్నారు. సెంటర్లలో ఖచ్చితంగా సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలని, అందులో చెప్పిన ధరలనే తీసుకోవాలంటున్నారు. ఎక్కడైనా ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టు దృష్టికి వస్తే డయల్ 1100 లేదా 18004251110 నంబర్కు కాల్ చేసి . meesevasupport@telangana.gov.in మొయిల్ చేసి సమాచారం ఇస్తే యాక్షన్ తీసుకుంటామంటున్నారు అధికారు.