
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన ప్రస్తుతం ‘బరి’ (Bhari) మూవీలో నటిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ కోసం వరుణ్ గత కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటున్నారు. అయితే, ఈ ప్రాక్టీస్ సెషన్ ఆయనను ఆసుపత్రి పాలు చేసింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అసలేం జరిగింది?
యువ దర్శకుడు యదు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బరి’ క్రీడల నేపథ్యంలో సాగుతుంది. మంగళవారం ఈ సినిమా కోసం ఫిజికల్ ట్రైనింగ్, ప్రాక్టీస్ నిర్వహిస్తుండగా వరుణ్ తేజ్ కాలికి తీవ్రమైన గాయం అయింది. నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన్ని చిత్ర యూనిట్ వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు కాలికి శస్త్రచికిత్స అవసరమని సూచించారు.
సర్జరీ సక్సెస్.. విశ్రాంతిలో వరుణ్
వైద్యుల పర్యవేక్షణలో బుధవారం వరుణ్ తేజ్‌కు ఆపరేషన్ నిర్వహించగా, అది విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్య బృందం వెల్లడించింది. అయితే, కాలి గాయం కావడంతో కనీసం 4 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాతే నడవడానికి ప్రయత్నించాలని డాక్టర్లు సూచించారు.
షూటింగ్‌కు బ్రేక్..
వరుణ్ తేజ్ గాయపడటంతో ‘బరి’ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఆయన కోలుకున్న తర్వాతే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నారు.
‘గెట్ వెల్ సూన్’ సందేశాలు
వరుణ్ తేజ్ సర్జరీ వార్త విన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. #GetWellSoonVarunTej అనే హాష్ ట్యాగ్‌తో పోస్టులు పెడుతూ, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు వరుణ్‌ను పరామర్శించి, ధైర్యం చెబుతున్నారు. మెగా ప్రిన్స్ మళ్ళీ జోష్‌తో ‘బరి’లోకి దిగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.