
న్యూఢిల్లీ:పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్.. డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తామని ప్రకటించింది. కాగా, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ రెండు బిల్లులను ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అయింది.
ఈ క్రమంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బిల్లులకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బుధవారం (ఏప్రిల్ 15) ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కూటమి నేతలు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్లపై అనాడైనా ఇనాడైనా కాంగ్రెస్‌ది ఒకటే స్టాండ్ అని పేర్కొన్నారు.
డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ట్రిక్కులకు వ్యతిరేకమని.. మహిళా రిజర్వేషన్లు అంటూ దొంగ దారిలో డీలిమిటేషన్ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంట్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలియజేశారు. డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే హడావుడిగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశ పెడుతోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్ లో సమిష్టిగా పోరాడుతామని తెలిపారు.