Reading Time: 2 minutes
Iran Us Talks Fail Security Threats Flight Diversion Marandi Claims

గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్యలు జరిగాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో దాదాపు 21 గంటల పాటు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. కానీ చర్చలు విఫలం కావడంతో ఎవరి దారిన వారు తిరిగి వెళ్లిపోయారు.

తాజాగా ఆ నాడు ఎదురైన పరిణామాలను ఇరాన్ రాజకీయ విశ్లేషకుడు మహ్మద్ మరాండి వెల్లడించారు. ఈ సందర్భంగా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాతో చర్చలు విఫలం కాగానే ఇరాన్ ప్రతినిధి బృందం భద్రతా ముప్పులను ఎదుర్కొందని ఆరోపించారు.

మహ్మద్ మరాండి వివరాల ప్రకారం… అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్‌కు వెళ్తున్న సమయంలోనే ఇరాన్ విమానంపై దాడి జరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష హెచ్చరికలు అందినట్లుగా తెలిపారు. ఇక చర్చలు విఫలం అయ్యాక తిరుగు ప్రయాణంలో ఇరాన్ ప్రతినిధి బృందం అత్యంత జాగ్రత్తలు తీసుకుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో మధ్యలోనే విమానం మారిపోయారని.. మరో విమానం కూడా హఠాత్తుగా మష్హాద్ నగరంలో ల్యాండ్ అయిందని చెప్పుకొచ్చారు. అనంతరం అక్కడి నుంచి బస్సులు, రైళ్లు, కార్ల ద్వారా టెహ్రాన్‌కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. తమ విమానాన్ని ఇజ్రాయెల్, అమెరికా కూల్చివేసే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.

ఇది కూడా చదవండి: Vijay: డీలిమిటేషన్‌తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు

ఇదిలా ఉంటే మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారాంతంలోనే మళ్లీ ఇస్లామాబాద్‌ వేదికగా చర్చలు పునఃప్రారంభం కావచ్చని పాకిస్థాన్‌లోని ఇరాన్ ఎంబసీ వర్గాలు తెలిపినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ అధికారులు కూడా ఇరాన్‌తో సంప్రదింపులు జరిపారని.. రెండో దఫా చర్చలకు ఇరాన్ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కచ్చితమైన తేదీ మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఈలోపే చర్చలు ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Raghav Chadha: రాఘవ్ చద్దాకు అండగా కేంద్రం.. జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు!

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. మొత్తానికి 40 రోజుల తర్వాత రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు ఏప్రిల్ 21తో ముగుస్తుంది.