
ముంబై మహానగరంలోని రద్దీ రోడ్లు.. కాలంతో పరిగెత్తే జీవితాలు.. ఎవరి దారి వారిదే. కానీ అదే నగరంలో ఒక సాదాసీదా ఆటో ప్రయాణం ఒక యువతికి వెలకట్టలేని భరోసానిచ్చింది. “నువ్వు ఎంత మంచి ఆటో డ్రైవర్ భయ్యా.. నీలాగా అందరూ ఉంటే మహిళలు సేఫ్” అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈరోజుల్లో సమాజంలో జరుగుతున్న వింత వింత క్రైమ్ స్టోరీలు చూస్తుంటే ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడే మహిళలకు.. ఈ ఆటో డ్రైవర్ తన సీటు వెనుక రాసుకున్న కొన్ని అక్షరాలు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి.
ముంబైకి చెందిన కంటెంట్ క్రియేటర్ ఉన్నతి దేవాలియా అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆమె ఒక ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు.. డ్రైవర్ సీటు వెనుక ఒక బోర్డు కనిపించింది. దానిపై ఉన్న సందేశం ఆమె మనసును హత్తుకుంది. “నేను కూడా ఎవరో ఒకరికి తండ్రిని, సోదరుడిని. మీ భద్రత నాకు చాలా ముఖ్యం. ఎటువంటి ఆందోళన లేకుండా హాయిగా కూర్చోండి” అని ఆ డ్రైవర్ రాసుకున్నాడు. ఈ మాటలు చదవగానే ఆమెకు కలిగిన అనుభూతిని “ప్రతి మగాడు డేంజర్ కాదు, కొందరు సురక్షితమైన నీడలా ఉంటారు” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది ఆమె.
ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణించే ముంబై లాంటి నగరాల్లో.. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళల సేఫ్టీ అనేది పెద్ద సవాలు. తెలియని వ్యక్తులతో ప్రయాణం చేసేటప్పుడు కలిగే ఆందోళన, అనుమానం సహజమే. అయితే.. ఒక ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా బాధ్యత తీసుకుని, తన ప్రయాణికులకు ఒక సోదరుడిలా, తండ్రిలా భరోసా ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం అంటున్నారు నెటిజన్లు. ఈ చిన్న సందేశం ఆ ఆటోవాలా సంస్కారానికి, తోటి మనుషులపై ఉన్న గౌరవానికి నిదర్శనం అంటున్నారు.
నెట్టింట వైరల్ అవుతున్నా ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. “మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఇలాంటి డ్రైవర్లు దేశం మొత్తం ఉండాలి” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు తారసపడితే ఆ ప్రయాణం ఎంతో ప్రశాంతంగా సాగుతుందని మరికొందరు మహిళలు అభిప్రాయపడుతున్నారు. భయం నీడలో బ్రతుకుతున్న సమాజంలో.. నమ్మకాన్ని బిల్డ్ చేస్తున్న ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే పెద్ద మార్పులకు పునాది వేస్తాయంటున్నారు.