
అమరావతి: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి బుధవారం (ఏప్రిల్ 15) మీడియాతో మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహేతుకంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌పై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌పై ప్రజల్లో ఉన్న అభ్యంతరాలను తొలగించాలని సూచించారు.
డీలిమిటేషన్ తో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ కేంద్ర ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజనకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్ష వైసీపీ మద్దతు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేసి ఆయా కొత్త స్థానాల ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతమున్న 545 లోక్ సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఇందులో రాష్ట్రాలకు గరిష్టంగా 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు గరిష్టంగా 35 స్థానాలు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులుపై చర్చించి ఆమోదించేందుకు ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానంతో తమకు అన్యాయం జరుగుతోందని సౌత్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.