
ఒకవైపు హార్మూజ్ జలసంధి వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. అటు ఇరాన్ తో చర్చలు జరుపుతూనే 2026 ఏప్రిల్ 13న తమ నావికా దళాలను హార్మూజ్ చుట్టూ మోహరించాలని ట్రంప్ ఆదేశించారు. దీంతో హార్మూజ్ జలసంధితో పాటు ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధం చేసింది. ఈ దెబ్బతో నౌకల రవాణా ఆగిపోయి ఒక్కరోజులోనే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ 100 డాలర్ల వరకు చేరుకున్నాయి. అయితే ఇది కేవలం ఇరాన్ ను టార్గెట్ చేసేందుకునే నని.. ఇతర నౌకలపై ఎలాంటి నిషేధం లేదని అమెరికా పేర్కొంది.
ఇదిలా ఉండగానే ట్రంప్ మరో జలసంధిపై గురి పెట్టారు. చైనా, ఇండియాకు కీలకమైన మలక్కా జలసంధిని ఫోకస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇండోనేషియాతో చర్చలు జరుపుతున్నారు. ప్రపంచ నౌకా రవాణాను కంట్రోల్ చేయాలనే లక్ష్యంతో అమెరికా ఇప్పుడు మరో జలసంధిని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హార్మూజ్ జలసంధిని దిగ్బంధించిన రోజే.. ఏప్రిల్ 13న అమెరికా-ఇండోనేషియా డీల్ కుదుర్చుకోవడం సంచలనంగా మారింది. ఈ డీల్ ప్రకారం అమెరికా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండోనేషియా గగన తలాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇది మలక్కా జలసంధిపై ఆధిపత్యం చెలాయించేందుకే అమెరికా ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకుందని భావిస్తున్నారు.
- మలక్కా జలసంధి:
3 కిలోమీటర్ల వెడల్పులో ఉండే మలక్కా జలసంధి ఫిలిప్ చానెల్ దగ్గర హర్మూజ్ జలసంధికంటే 9 రెట్లు ఇరుకు ఉంటుంది. ఇది ప్రపంచలోనే అత్యంత బిజీగా ఉండే జలసంధిలలో ఇది ఒకటి. ప్రపంచ రవాణాలో 40 శాతం వాణిజ్యం ఇక్కడ జరుగుతుంటుంది. మలేషియా, సింగపూర్ తో పాటు మలక్కా జలసంధిని ఇండోనేషియా కంట్రోల్ చేస్తుంటుంది. గల్ఫ్ లో పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్న అమెరికా.. ఇప్పుడు ఇండో-పసిఫిక్ రీజన్ లో ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుందని ఇండోనేషియాతో ట్రంప్ చేసుకున్న ఒప్పందం ద్వారా తెలుస్తోంది.
►ALSO READ | యుద్ధం ఆల్మోస్ట్ ముగిసినట్లే.. కానీ ఇరాన్ కొంచెం బెట్టు చేస్తోంది: ట్రంప్
మలక్కా జలసంధి గుండా ట్యాంకర్లు, కంటైనర్ షిప్పులు, కార్లు, సెమీకండక్టర్లు, వివిధ రకాల వస్తు సామాగ్రికి సంబంధించిన రవాణా జరుగుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇక్కణ్నుంచి రవాణా జరుగుతుంటుంది.
- చైనాకు ఎందుకు కీలకం:
మలక్కా జలసంధి హిందూ మహాసముద్రం, సౌత్ ఈస్ట్ ఆసియా (ఆగ్నేయాసియా) ను కలుపుతూ.. ప్రపంచ నౌకా రవాణాలో 30 శాతం వాణిజ్యం జరుగుతుంటుంది. ఇది హర్మూజ్ జలసంధికంటే ఎక్కువ. చైనా, జపాన్ కు చమురు, ఎల్ఎన్జీ రవాణాలో కీలక పాత్ర వహిస్తుంది. చైనాకు 80 శాతం చమురు దిగుమతులు ఈ ప్యాసేజ్ గుండానే జరుగుతుంటాయి. అదే క్రమంలో చైనా ఇండస్ట్రియల్ ఎకానమీలో అంటే.. మేడ్ ఇన్ చైనా గూడ్స్ ఎగుమతిలో ఇది చాలా ముఖ్యం. చైనాకు హార్మూజ్ నుంచి కొంతమేర ఆయిల్ వస్తున్నప్పటికీ.. మలక్కా జలసంధి చైనాకు ఆయువు పట్టు లాంటింది.
- ఇండియాకు ఎందుకు ముఖ్యం:
మలక్కా జలసంధి ఇండియాకు చాలా కీలకం. వాణిజ్యంలో సుమారు 55 శాతం మలక్కా జల సంధి మీదుగానే జరుగుతోంది. ఈ జల సంధి స్టార్టింగ్ పాయింట్ అండమాన్ నికోబార్ దీవుల దక్షిణ కొనకు దగ్గరగా ఉండటం చైనాకు ఆందోళన కలిగించే విషయం. పోర్ట్ బ్లెయిర్ నుంచి మలక్కా జల సంధిని చేరుకోవడానికి 24 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది.
చైనాను దెబ్బకొట్టాలనే లక్ష్యంతో గతంలో హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్‌ను బలోపేతం చేయడానికి అమెరికా ప్రయత్నించింది. అయితే ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా ఇండియా సహకారం అవసరం. అండమాన్, నికోబార్ దీవుల్లో ఇండియా సైనిక, నౌకా స్థావరాలను నిర్వహిస్తోంది. ఇటీవలే మలక్కా జల సంధి గస్తీ కార్యక్రమాల్లో ఇండయాతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ ముందుకు వచ్చింది. ట్రంప్ భవిష్యత్తులో ఏవైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే ఇండియా కీలకంగా మారనుంది. అయితే ఇండియాతో సంబంధం లేకుండా ఇండోనేషియా ద్వారా ట్రంప్ చైనాకు చెక్ పెట్టాలని చూస్తున్నారా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.