
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ప్రకారం సోమవారం (ఏప్రిల్ 13) రాత్రి వినేష్ చందేల్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి 2021 నుంచి ఐప్యాక్ సంస్థ పొలిటికల్ కన్సల్టెన్సీగా పని చేస్తోన్న విషయం తెలిసిందే.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం, ఇతర కీలకమైన అంశాలకు సంబంధించి సలహాలు అందిస్తోంది. దీంతో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఐప్యాక్ డైరెక్టర్‌ను ఈడీ అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వినేష్ చందేల్ అరెస్ట్‌పై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాజకీయ కుట్రలో భాగంగానే ఎన్నికలకు ముందు వినేష్ చందేల్‌ను ఈడీ అరెస్ట్ చేసిందని టీఎంసీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో టీఎంసీని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ అడ్డదారిలో గెలవడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీఎంసీ ఆరోపణలను తిప్పికొడుతోన్న బీజేపీ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కౌంటర్ ఇస్తోంది. వినేష్ చందేల్ అరెస్ట్‌తో తమ అవినీతి అక్రమాలు బయటపడతాయని టీఎంసీ భయపడుతోందని బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతిసవాళ్లు, ఆరోపణలు ప్రత్యారోపణలతో బెంగాల్ రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా వినేష్ చందేల్ అరెస్ట్‌తో రెండు పార్టీల మధ్య పోరు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లనుంది.