
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే పేరు మారుమోగిపోతోంది.. అతడే 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరులో ఈ చిన్నారి సంచలనం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ప్రపంచ మేటి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనే ఏమాత్రం భయం లేకుండా సిక్సర్లతో విరుచుకుపడి క్రికెట్ దిగ్గజాలనే ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఇరు జట్లకు 11 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే బుమ్రా వర్సెస్ సూర్యవంశీ పోరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనుభవజ్ఞుడైన బుమ్రాను ఈ కుర్రాడు ఎలా ఎదుర్కొంటాడో అని అంతా అనుకుంటున్న తరుణంలో.. సూర్యవంశీ ఊహించని రీతిలో చెలరేగిపోయాడు.
సూర్యవంశీ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఎదుర్కొన్న మొట్టమొదటి బంతికే లాంగ్ ఆన్ మీదుగా కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. తన కచ్చితత్వానికి పేరుగాంచిన బుమ్రా సైతం ఆ షాట్‌కు అవాక్కయ్యాడు. ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా బుమ్రా చిరునవ్వుతో వెనుదిరిగినప్పటికీ, సూర్యవంశీ దాడి అక్కడితో ఆగలేదు. అదే ఓవర్లో లెగ్ సైడ్ వచ్చిన బంతిని వెనక్కి వంగి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా మరో భారీ సిక్సర్ బాది స్టాండ్స్‌లోకి పంపాడు.
అవాక్కైన ముంబై సీనియర్లు
సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా వంటి ఆటగాళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కనిపించారు. బుమ్రా తన ఓవర్లో 14 పరుగులు సమర్పించుకోగా.. మరోవైపు యశస్వి జైస్వాల్ ధాటికి మొదటి ఓవర్లోనే 22 పరుగులు వచ్చాయి. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సూర్యవంశీ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టినప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ముఖంలో స్పష్టమైన నిరాశ, అసంతృప్తి కనిపించాయి.
కేవలం 14 బంతుల్లోనే విధ్వంసం..
సూర్యవంశీ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు సాధించి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, ఏకంగా 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. చివరకు శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సూర్యవంశీ, జైస్వాల్ ద్వయం ముంబై బౌలర్లపై చేసిన దాడి ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 15 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఇంతలా భయపెట్టిన సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్‌లో ఒక గొప్ప ధృవతార అవుతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
The sheer audacity of Vaibhav Sooryavanshi
The 1⃣5⃣ year old welcomes Jasprit Bumrah with a maximum!
#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X
— IndianPremierLeague (@IPL) April 7, 2026

The 1⃣5⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 