దక్షిణ భారతీయ వంటకమైన ఇడ్లీ, ఉప్మా అలాగే పోహా.. ఇవన్నీ ప్రాచీన కాలం నుండి మన ఆహారంలో భాగమే. ఆవిరి మీద ఉడకడం వల్ల ఇవి జీర్ణక్రియకు మంచివని అందరికీ తెలుసు. కానీ వీటిని తినే పద్ధతిలోనే అసలు సమస్య దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇడ్లీ, ఉప్మా, పోహా వంటి ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటాయి. వీటిలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ చాలా తక్కువ.
షుగర్ స్పైక్స్: కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉన్న అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చినప్పటికీ, అంతే వేగంగా నీరసపడిపోయేలా చేస్తుంది. ఫలితంగా మళ్లీ ఆకలి వేయడం, అతిగా తినడం వంటి అలవాట్లు మొదలవుతాయి.
నేను చాలా లైట్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను అని చెప్పుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రోటీన్ లేని అల్పాహారం వల్ల ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు ఉన్నాయి. దీర్ఘకాలం పాటు ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ లెవల్స్‌లో తేడాలు వస్తాయి. తక్కువ ప్రోటీన్ తీసుకునే వారిలో ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కూరగాయలు, పీచు పదార్థం లేని అల్పాహారం మీ మెటబాలిజంను మందగింపజేస్తుంది. శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
ఈ ఆహార పదార్థాలు చెడ్డవి కావు, కానీ వాటిని తినే విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలని డైటీషియన్ సూచిస్తున్నారు. పోహా చేసేటప్పుడు అందులో వేరుశెనగలు, మొలకలు, ఎక్కువ మొత్తంలో కూరగాయలను చేర్చండి. ఉప్మాను వారానికి రెండు సార్లు మించకుండా చూసుకోండి. చేసేటప్పుడు అందులో పప్పులు, పనీర్ లేదా డ్రై ఫ్రూట్స్ కలపడం మర్చిపోవద్దు.
ఇడ్లీని ఎప్పుడూ ఒంటరిగా తినకండి. సాంబార్లో ఉండే పప్పులు, కూరగాయలు మీకు కావాల్సిన ప్రోటీన్, ఫైబర్‌ను అందిస్తాయి. తో్తలమీరు మాంసాహారులైతే అల్పాహారంతో పాటు ఉడికించిన గుడ్డును, శాకాహారులైతే పనీర్‌ను చేర్చుకోండి. ఇది జీర్ణక్రియను క్రమబద్ధం చేసి చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. కార్బోహైడ్రేట్లను ఎప్పుడూ ఒంటరిగా తీసుకోవద్దు. వాటిని ప్రోటీన్, ఫైబర్‌తో సమతుల్యం చేసినప్పుడే అది సంపూర్ణ ఆరోగ్యకరమైన అల్పాహారంగా మారుతుంది.




