Reading Time: 2 minutes
యుద్ధంపై ట్రంప్‌ కీలక ప్రకటన — ఇరాన్‌పై తాత్కాలికంగా దాడులు నిలిపివేత

పశ్చిమాసియాలో ఉత్కంఠ రేపిన అమెరికా-ఇరాన్ యుద్ధంలో ఒక్కసారిగా అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవాలన్న షరతుపైనే.. ఈ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు స్పష్టం చేశారు. అయితే, ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. తమ ఒప్పందానికి తలొగ్గకపోతే… ఈ రాత్రికే ఇరాన్‌లో ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుందని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పౌర సముదాయాలు, మౌలిక వసతులపై భారీ దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే… అమెరికా సైన్యం యాక్షన్ మొదలుపెట్టింది. ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఖార్గ్ ఐలాండ్‌లోని ఆయిల్ ఎగుమతి కేంద్రాలు, వంతెనలపై అమెరికా బలగాలు ముమ్మర దాడులు చేశాయి.

ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో దీటుగా బదులిచ్చింది. అమెరికా దాడులను కొనసాగిస్తే… ఆ దేశంతో పాటు మిత్రదేశాలకు ఏళ్ల పాటు ఆయిల్, గ్యాస్ అందకుండా చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. సైనిక దాడుల నుంచి తమ పవర్ ప్లాంట్లను కాపాడుకునేందుకు… యువత అంతా మానవహారంగా ఏర్పడాలని ఇరాన్ అధికారులు పిలుపునిచ్చారు. ట్రంప్ డెడ్‌లైన్‌కు కొన్ని గంటలు ఉందనగా.. సీజ్ ఫైర్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు ట్రూత్‌లో పోస్ట్ చేశారు. వైట్ హౌస్.. దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది.

అటు ఇరాన్ సైతం కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే హర్మూజ్ జలసంధి కూడా ఓపెన్ చేస్తున్నట్లు చెప్పింది. రెండు వారాలపాటు హర్మూజ్‌ తెరుస్తామన్నారు ఇరాన్ సుప్రీం నేతలు. తమ 10 పాయింట్ల ప్రతిపాదనకు అమెరికా అంగీకరించిందన్నారు. హర్మూజ్‌కు అవతల ఉన్న నౌకలను భద్రంగా జలసంధి దాటిస్తామన్నారు ఇరాన్ నేతలు.

హార్ముజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరవాలన్న షరతుతోనే.. తాను ఈ డబుల్ సైడెడ్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు స్పష్టం చేశారు ట్రంప్. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన విజ్ఞప్తి మేరకే దాడులు ఆపాలని నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ నుంచి పది పాయింట్ల శాంతి ప్రతిపాదన తమకు అందిందని.. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం దిశగా చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తాజా ప్రకటనతో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా వీడినప్పటికీ… రాబోయే రెండు వారాల్లో పరిస్థితులు ఎటు దారి తీస్తాయన్నది ఉత్కంఠగా మారింది.

ఇరాన్ 10 పాయింట్స్ ఒక్కసారి పరిశీలిస్తే..

1. ఇరాన్‌పై దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి

2. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగింపు

3. యురేనియం ఎన్‌రిచ్‌మెంట్‌కు అంగీకరించడం

4. అన్ని ప్రాథమిక ఆంక్షలు ఎత్తివేయడం

5. ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయడం

6. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం రద్దు చేయడం

7. IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలన్నింటిని రద్దు చేయడం

8. ఇరాన్‌కు నష్టపరిహారం చెల్లించడం

9. ఇరాన్ భూభాగం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడం

10. లెబనాన్‌ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయడం