చర్మ సంరక్షణలో ముఖానికే చాలా మంది అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ మోచేతులు, మోకాళ్లు, మెడ వంటి భాగాలను పెద్దగా పట్టించుకోరు. దీని ఫలితంగా ఈ భాగాలు నల్లగా మారతాయి. అయితే కోల్పోయిన కాంతిని తిరిగి తీసుకువచ్చే సులభమైన ఇంటి నివారణ చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..
నిమ్మకాయను సగానికి కోసి, దానిపై కొద్దిగా చక్కెర చల్లండి. ఈ మిశ్రమాన్ని మీ మోచేతులపై 10 నిమిషాల పాటు మెల్లగా రుద్దండి. ఇది మృత చర్మ కణాలను తొలగించి మోచేతులపై ఉన్న నల్లటి మచ్చలను త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది.
అర టీస్పూన్ పసుపు పొడిని ఒక టీస్పూన్ పెట్రోలియం జెల్లీతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ మోచేతులపై అప్లే చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వాడటం వల్ల నల్ల మచ్చలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కొద్దిగా పాలతో కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై అప్లై చేసి, కనీసం 2-3 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా క్రమంగా చేస్తే కొద్ది రోజుల్లోనే తేడాను చూస్తారు.
ఎండిన నారింజ తొక్కలను మెత్తగా నూరి, అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులు,మోకాళ్లపై పూసి 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. నూనె చర్మంలోకి ఇంకిన తర్వాత ఒక గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. ఈ చిట్కాలను క్రమంగా వినియోగించడం వల్ల చర్మం రంగులో మార్పు కనిపిస్తుంది.




