
ఐపీఎల్ వేలంలో కోట్లు పలికిన ఆటగాళ్లపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఒత్తిడికి గురై పేలవ ప్రదర్శన చేసిన ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా కొంతమంది ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. భారీ మొత్తాలు వెచ్చించిన ఫ్రాంచైజీలకు నిరాశను మిగులుస్తున్నారు. వేలంలో కోట్లు పెట్టి కొన్న కొన్ని ప్రాంఛైజీలు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి.
భారీ అంచనాల మధ్య ఐపీఎల్ 2026లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పూర్తిగా నిరాశపరిచాడు. రూ.25.20 కోట్ల భారీ ధరకు కొన్న కేకేఆర్.. అతడి ప్రదర్శనపై అసంతృప్తిగా ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 18, 2, 4 రన్స్ మాత్రమే చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రూ.7 కోట్లు పలికిన వెంకటేష్ అయ్యర్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అలాగే రూ.8.40 కోట్లకు తీసుకున్న ఆఖిబ్ నబీ కూడా ఇంకా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాలేదు.
Also Read: Ananya Birla-RCB: అన్ని కోట్లు ఉన్నా ఆ సింప్లిసిటీ ఏందయ్యా.. ఆర్‌సీబీ ఓనర్ అనన్య అదుర్స్!
లియామ్ లివింగ్‌స్టోన్ రూ.13 కోట్ల ధరకు కొనుగోలు చేయగా.. ఒకే మ్యాచ్ ఆడాడు. అందులో 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కార్తీక్ శర్మ (రూ.14.20 కోట్లు) మూడు మ్యాచ్‌ల్లో 18, 1, 6 పరుగులతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అదే ధరకు కొనుగోలు చేసిన ప్రశాంత్ వీర్ రెండు మ్యాచ్‌ల్లో 6*, 43 పరుగులతో కొంత మెరుగైన ప్రదర్శన చూపించాడు. మొత్తంగా చూస్తే భారీ ధరలకు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో చాలా మంది ఇప్పటివరకు నిరాశపరిచారు. ముఖ్యంగా గ్రీన్, లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ఆటగాళ్లపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.