Reading Time: 2 minutes
Alert: అంతా స్లో పాయిజన్.. ఎక్కడో ఊరి బయట జరగట్లేదు.. మన ఇళ్ల మధ్యనే సాగుతున్న కనికట్టు!

కల్తీ మన ఆరోగ్యాన్ని కాటేస్తోంది. మార్కెట్లో దొరికే వాటిలో ఏవి కల్తీనో.. ఏవి నాణ్యమైనవో తెలియని పరిస్థితి నెలకొంది. కల్తీ పదార్థాలు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మీరు తినే ఆహారం.. తాగే పాలు.. చివరకు ఇంట్లో వాడే కారం పొడి వరకు.. అన్నీ విషతుల్యమే. కల్తీ సామ్రాజ్యం విస్తరిస్తు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఫుడ్ సేఫ్టీ రైడ్స్ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? కల్తీని మనం ఎలా గుర్తించాలి? ఇదే ప్రతి సామాన్యుడిని తొలుస్తున్న ప్రశ్న.

మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడ పురుగులుండు.. సేమ్ టు సేమ్‌.. మనం తినే ఆహారం పరిస్థితి ఇదే. అంతా స్లోపాయిజన్. ఎక్కడో ఊరి బయట జరగట్లేదీ కల్తీ. మన ఇళ్ల మధ్యనే సాగుతోంది. మన అదృష్టం బాగుండి.. తనిఖీల్లో కల్తీ సరుకు పట్టబడితే బయటపడతాం.. లేదంటే అంతే సంగతులు..! మనుషుల ఆరోగ్యాలపై వికృత ప్రయోగాలు చేస్తూ.. కాసులకు కక్కుర్తిపడి.. కల్తీ మహమ్మారిని విస్తరిస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల మటన్‌ షాపుల్లో కుళ్లిన మాంసం, హైదరాబాద్‌ ఫేమస్‌ ఉస్మానియా బిస్కెట్‌నూ కల్తీ చేశారు. కుళ్లిన కోడిగుడ్లు, కెమికల్స్‌, సింథటిక్‌ కలర్స్‌తో కల్తీ ఫుడ్ తయారు చేస్తున్నారు కంత్రీగాళ్లు. అంతేకాదు, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి.

ఈ క్రమంలోనే తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉరుము లేని పిడుగులా విరుచుకుపడుతున్నారు. బడా రెస్టారెంట్లు మొదలుకుని వీధి పక్కన బండ్ల వరకు దేనిని వదలడం లేదు. కిచెన్లలో అడుగుపెడితే కళ్లు బయర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. నెలల తరబడి నిల్వ ఉంచిన మాంసం.. రంగులు కలిపిన పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం. ప్రజల ఆరోగ్యాన్ని తుంగలో తొక్కేస్తున్న కల్తీ గల్లా పనితనాన్ని ఫుడ్ సెఫ్టీ బృందాలు బట్టబయలు చేస్తున్నాయి. కేవలం జరిమానాలతో సరిపెట్టడం లేదు సర్కార్! కల్తీకి పాల్పడితే క్రిమినల్ కేసులు, జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది. హెల్త్ ప్రొఫైలింగ్ లో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ఆహార ప్రభావం ఎలా ఉందో విశ్లేషిస్తోంది. ఇక నుంచి ప్రతి చోట హైజీన్ రేటింగ్ ను ప్రదర్శించడం తప్పనిసరి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ, కల్తీ రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ప్రభుత్వం.

కల్తీ గుర్తించడం ఎలా?

  1. మరి ఇంత కల్తీలో సామాన్యుడు తనను తాను ఎలా కాపాడుకోవాలి? మీ ఇంట్లోనే చిన్న చిన్న పరీక్షలతో కల్తీని పసిగట్టవచ్చు అంటున్నారు నిపుణులు.
  2. ఒక చుక్క పాలను నిలువుగా ఉన్న ప్లేట్‌పై వేయండి.
  3. అది తెల్లటి గీతను వదిలితే స్వచ్ఛమైనది, నీళ్లలా పారితే కల్తీ జరిగినట్లే.
  4. గ్లాసు నీటిలో చెంచా కారం వేయండి.
  5. రంగు నీటిలోకి త్వరగా దిగినా, ఇసుకలాంటి పదార్థం అడుగున చేరినా అది కల్తీ.
  6. మెరిసిపోతున్న పండ్లను చూసి మోసపోకండి.
  7. కాల్షియం కార్బైడ్ వాడితే పండ్లు పసుపు పచ్చగా ఉన్నా, లోపల రుచి ఉండదు.

ఒక్క పండే కాదు ఒక కారంపొడే కాదు.. ఇంట్లో మనకు రెగ్యులర్‌గా అవసరమయ్యే పన్నీర్, బెల్లం, పప్పు దినుసులు, ధనియాలు, రాగులు ఇలా చాలా వస్తువులను బేషుగ్గా మనం చూపు ద్వారా లేదా చిన్నపాటి టెస్టు ద్వారా ఏది కల్తీ ఏది ఒరిజినల్ గుర్తుపట్టవచ్చు. ఇవన్నీ చూసైనా మేల్కోకపోతే ప్రాణాలు పోవడం పక్కా. అవుట్ సైడ్ ఫుడ్ తినొద్దు.. డబ్బాల్లో తెచ్చి పోసే పాలు, ప్యాకింగ్‌ లేని పనీర్, నెయ్యితో జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. ప్లాస్టిక్‌ కవర్లల్లో ఎలాంటి లేబుళ్లు లేని వాటిని కొనొద్దు.

ఆరోగ్యమే మహాభాగ్యం.. కానీ ఆ ఆరోగ్యం మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం తన వంతుగా తనిఖీలు చేస్తున్నా, వినియోగదారులుగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికి వెళ్లిన రంగు, రుచితో పాటు అసలు, నకిలీ నీ కూడా గమనించండి. కల్తీ కనిపిస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా అధికారులకు ఫిర్యాదు చేయండి. . బీ కేర్ ఫుల్ అని హెచ్చరిస్తున్నారు అధికారులు..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..