
Kevin Pietersen: భారత ప్రీమియర్ లీగ్ ఎంతోమందికి వరంగా మారితే, తన విషయంలో మాత్రం అది శాపంగా మారిందని ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ వల్ల తన క్రికెట్ ప్రయాణం ఎలా దెబ్బతిన్నదో వివరిస్తూ ఆయన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై (ECB) తీవ్ర విమర్శలు గుప్పించాడు.
బోర్డు కుట్రలు – మీడియా ప్రచారం..
పీటర్సన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ఐపీఎల్‌లో ఆడాలని నిర్ణయించుకున్న సమయం నుంచి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తనపై కక్షగట్టిందని పేర్కొన్నాడు. తాను భారత్‌లో జరుగుతున్న ఈ లీగ్‌లో పాల్గొనడం బోర్డులోని పెద్దలకు నచ్చలేదని, అందుకే తనపై రకరకాల కుట్రలు పన్నారని ఆయన ఆరోపించాడు. మీడియాను కూడా తనపైకి ఉసిగొల్పి, తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారని పీటర్సన్ వాపోయాడు.
త్యాగం నాది.. ప్రయోజనం అందరిది..
“నేను ఐపీఎల్ కోసం చాలా త్యాగాలు చేశాను. ఆ నిర్ణయం వల్లే నా కెరీర్ నాశనమైంది. నేను ఇంగ్లాండ్ తరపున 104 టెస్టులు ఆడాను, కానీ నాకు 150 నుంచి 160 టెస్టులు ఆడే సత్తా ఉంది. కేవలం బోర్డు వ్యతిరేకత వల్లే 33 ఏళ్లకే నా అంతర్జాతీయ క్రికెట్ ముగిసిపోయింది” అని ఆయన తెలిపాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ తనకు కృతజ్ఞతలు చెప్పాడని, తన పోరాటం వల్లే నేడు ఇంగ్లాండ్ ఆటగాళ్లందరికీ ఐపీఎల్‌లో ఆడే స్వేచ్ఛ దొరికిందని పీటర్సన్ గుర్తుచేశాడు.
పీటర్సన్ గణాంకాలు..
కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో ఒకరు.
టెస్ట్ క్రికెట్: 104 మ్యాచ్‌లలో 8181 పరుగులు (23 శతకాలు, 35 అర్ధశతకాలు).
వన్డే క్రికెట్: 136 మ్యాచ్‌లలో 4440 పరుగులు (9 శతకాలు, 25 అర్ధశతకాలు).
టీ20: 37 మ్యాచ్‌లలో 1176 పరుగులు.
ఇంతటి అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ, రాజకీయాల కారణంగా తాను త్వరగా రిటైర్ అవ్వాల్సి వచ్చిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..