
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారతదేశం గురువారంనాడు సంతాపం వ్యక్తం చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయం సందర్శించి భారతదేశం సానుభూతి సందేశాన్ని అక్కడి రాయబారికి అందించారు. ఇరాన్ రాయబార కార్యాలయంలో మిస్రీ భారత ప్రభుత్వం తరుపున సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీతో మిస్రీ సమావేశమైన ఫోటోను కూడా విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అమెరికా – ఇజ్రాయెల్ ఇరాన్ పై జరిపిన దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ ఫిబ్రవరి 28న మరణించారు.
పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో భారతదేశం సంక్షోభాన్ని నివారించేందుకు చర్చలు జరపాలని, దౌత్యం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని భారతదేశం పిలుపునిచ్చినప్పటికీ, ఖమేనీ హత్య పై స్పందించలేదు. ఖమేనీ మరణంపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడంతో గురువారం విదేశాంగ కార్యదర్శి మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, సంతాప పుస్తకంపై సంతకం చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.