
ముంబై: ఇటీవల దేశంలో యువత చేపట్టిన నిరసనలపై జాతీయ భద్రతా సలహాదారు, ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చింది చేయడం కాదని యువతకు చురకలటించారు. స్వేచ్ఛతో పాటు సమాజం, దేశం పట్ల బాధ్యతలు కూడా ఉంటాయని యువత గుర్తుంచుకోవాలని హితవు పలికారు. స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు చట్టబద్ధమైన పరిధిలోనే ఉండాలని నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలను కాపాడటం, చట్టాన్ని గౌరవించడం పౌరుల ప్రాథమిక విధి అని గుర్తు చేశారు. స్వేచ్ఛను ఇష్టానుసారంగా ఏమైనా చేసే అనియంత్రిత హక్కుగా భావించవద్దని యువతను హెచ్చరించారు.
కాగా, దేశ భద్రత, ఇంటెలిజెన్స్ రంగాలలో చేసిన అసమాన సేవలకు గాను అజిత్ దోవల్ ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 1) మహారాష్ట్రలోని పుణెలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా దోవల్ ఈ అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్‌మాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా లోక్‌మాన్య తిలక్ స్మారక్ ట్రస్ట్ ఈ పురస్కారాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఉద్యమకారులు చేసిన త్యాగాలను యువ భారతీయులు స్మరించుకోవాలని సూచించారు. భారతదేశ జాతీయ చైతన్యాన్ని తీర్చిదిద్దడంలో తిలక్ పోషించిన పాత్ర.. ఆయన జీవితం నుంచి యువతరం స్ఫూర్తి పొందాలని కోరారు.
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా యువత పోరుబాట:
నీట్ యూజీ 2026 క్వశ్చన్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చింది.
అయితే, ఈ చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. యువత నిరసనలను అణిచివేసేందుకు పోలీసులు దమనకాండ కొనసాగించారు. యువతపై లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. కొన్ని చోట్ల పోలీసుల బలప్రయోగంపై యువత తిరగబడ్డారు. దీంతో సీజేపీ తలపెట్టిన చలో పార్లమెంట్ తీవ్ర హింసాత్మకంగా మారింది.
విద్యార్థులపై పోలీసుల బలప్రయోగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు కూడా విద్యార్థుల దాడిని తీవ్రంగా ఖండించాయి. యువత, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మరో కేంద్రమంత్రి ప్రహ్లోద్ జోషి తాత్కాలికంగా విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.