Reading Time: < 1 minute

హైడ్రా చొరవతో.. కళకళలాడుతున్న ఉప్పల్ నల్లచెరువు..సరికొత్త హంగులతో సుందరీకరణ

Caption of Image.

 హైదరాబాద్ లోని  చెరువులకు హైడ్రా  పూర్వ వైభవం తెస్తోంది. ఈ క్రమంలో  హైడ్రా తీసుకున్న చర్యలతో  ఉప్పల్ నల్లచెరువు ఇప్పుడు సరికొత్త జలకళతో కళకళలాడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటితో ఈ చెరువు పూర్తిగా నిండి, సుందరంగా దర్శనమిస్తోంది.

నాచారం చెరువు నుంచి వరద నీరు ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా నల్లచెరువులోకి చేరేలా హైడ్రా అధికారులు ప్రత్యేకంగా రెండు ఇన్లెట్లను అభివృద్ధి చేశారు. అలాగే, మురుగు నీరు చెరువులో కలవకుండా వేరు చేసేందుకు ఒక బైపాస్ కాలువను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎగువ ప్రాంతాల ప్రజలకు వరద ముంపు సమస్య పూర్తిగా తొలగిపోయింది.

కేవలం నీటి చేరిక మాత్రమే కాకుండా, సుమారు 10 ఎకరాల మేర ఉన్న అన్యాక్రాంతమైన భూములను హైడ్రా సిబ్బంది పూర్తిగా తొలగించారు. దీంతో గతంలో కుచించుకుపోయిన ఈ చెరువు, ఇప్పుడు ఏకంగా 70 ఎకరాల విస్తీర్ణానికి చేరుకుంది. ప్రస్తుతం సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఈ చెరువు వద్ద సమగ్ర అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

చెరువు నిండిన తర్వాత అదనపు నీరు సురక్షితంగా మూసీ నదికి వెళ్లేలా పటిష్టమైన ఔట్లెట్‌ను కూడా అభివృద్ధి చేశారు. కేవలం నీటి వనరుగానే కాకుండా, స్థానిక ప్రజలకు ఒక అద్భుతమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. చెరువు చుట్టూ అందమైన వాకింగ్ ట్రాక్, మెయిన్ బండ్, పిల్లల కోసం ప్లే ఏరియా,ఓపెన్ జిమ్‌లను నిర్మిస్తున్నారు.

హైడ్రా తొలి దశలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న కీలక చెరువుల్లో నల్లచెరువు ఒకటి. త్వరలోనే హైదరాబాద్ నగరానికి ఇది మరో అద్భుతమైన  ఆహ్లాదకరమైన జలవనరుగా మారనుంది

 

©️ VIL Media Pvt Ltd.