
హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు దూకుడు పెంచారు. హెచ్-న్యూ (H-NEW),హుస్సేనీ ఆలం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ రట్టయింది. ఈ కేసులో ఇద్దరు డ్రగ్స్ నిందితులు, ఒక స్థానిక పెడ్లర్ ఒక ముంబై ట్రాన్స్‌పోర్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ.13.24 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల నుంచి 120 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, 5 గ్రాముల కొకైన్, అలాగే 27 ఎల్‌ఎస్‌డీ (LSD) బ్లాట్లను అధికారులు సీజ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నెట్‌వర్క్ గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు.
ఈ రాకెట్‌కు ప్రధాన సరఫరాదారుగా ఉన్న ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన నిందితులు, డ్రగ్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ఎలాంటి డిజిటల్ జాడ దొరక్కుండా కేవలం ఫోన్ కాల్స్ ద్వారానే డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలను సమన్వయం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగతా సభ్యుల కోసం కూడా గాలింపు కొనసాగుతోంది.