Reading Time: < 1 minute
Hyderabad: వీకెండ్స్‌లో నెహ్రూ జూపార్క్‌కు వెళుతున్నారా..? టికెట్ల రేట్లు భారీగా పెరిగాయ్.. ఇప్పటినుంచి ఎంతంటే..?

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కి వెళ్తున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. జూపార్క్ ఎంట్రీ ఫీజులను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. గతంలో పెద్దలకు ఎంట్రీ ఫీజు రూ.100గా ఉండగా.. చిన్నారులకు రూ.50గా ఉంది. ఇప్పుడు పెద్దలకు రూ.120 వసూలు చేయాలని నిర్ణయించగా.. చిన్నారులకు రూ.60గా ఫిక్స్ చేశారు. అంటే పెద్దల టికెట్‌పై ఇప్పుడు రూ.20 పెంచగా.. చిన్నారుల టికెట్‌పై రూ.10 పెంచారు. ఇక విదేశీయులకు సంబంధించి పెద్దలకు రూ.వెయ్యి, చిన్నారులకు రూ.500 టికెట్ ధర నిర్ణయించారు.

సఫారీ రైడ్స్ ధరలు ఇవే..

ఇక జూ పార్క్ ఎంట్రీ ఫీజులతో పాటు లోపల సఫారీ, చేపల ఆక్వేరియం, జంతుశాలకు సంబంధించిన ఫీజులను కూడా జూపార్క్ అధికారులు ప్రకటించారు. సఫారీ ఛార్జీల విషయానికొస్తే.. ఏసీ బస్సుల్లో ఒక్కరికీ రూ.165 వసూలు చేయనున్నారు. ఇక ఈ సఫారీ బస్సుల్లో ఒక్కొ వ్యక్తికి రూ.110, బ్యాటరీ వాహనాల్లో పెద్దలకు రూ.135, చిన్నారులకు రూ.75 వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక చిట్టి రైలు విషయానికొస్తే పెద్దలకు రూ.90, చిన్నారులకు రూ.45గా ఫిక్స్ చేశారు. కాలుష్య రహిత బ్యాటరీ వెహికల్‌లో 11 సీట్ల వాహనానికి రూ.3300, 14 సీట్ల వాహనానికి రూ.4400 వసూలు చేయనున్నట్లు జూపార్క్ అధికారులు స్పష్టం చేశారు.

ఇతర ధరలు ఇవే..

ఇక చేపల ఆక్వేరియం సందర్శనకు ఒక్కొరికి రూ.25 వసూలు చేయనున్నారు. ఇక నిశాచర జంతువుల సందర్శన కోసం పెద్దలకు రూ.25, చిన్నారులకు రూ.15 రుసం నిర్ణయించారు. ఇక సరిసృఫాల జగత్తు సందర్శనకు సంబంధించి పెద్దలకు టికెట్ ధర రూ.35, చిన్నారులకు రూ.15 నిర్ణయించారు. కెమెరాలకు రూ.500, కెమెరా విత్ లెన్స్ సెటప్‌ కోసం రూ.700 వసూలు చేయనున్నట్లు జూపార్క్ అధికారులు తెలిపారు. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అతి పెద్ద జూపార్క్‌గా హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ పేరు పొందింది. దీంతో వేరే రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి ఎక్కువగా వస్తూ ఉంటారు. శనివారం, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేల ఎకరాల్లో ఈ జూపార్క్ విస్తరించి ఉంది. అన్ని రకాల జంతువులు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ జూపార్క్ నడుస్తోంది.