Reading Time: < 1 minute
Watpally Police Station Attack Sangareddy

Watpally Police Station : సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్ స్టేషన్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వట్‌పల్లిలోని ఒక దాబాలో పనిచేస్తున్న బీరప్ప (22) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి పూర్వాపర సమాచారం అందించకుండానే వట్‌పల్లి పోలీసులు మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందికి దించేశారని ఆరోపిస్తూ మృతుని స్వగ్రామమైన దరఖాస్తుపల్లికి చెందిన ప్రజలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని వారి అనుమతి లేకుండా ఎలా దించుతారని ప్రశ్నిస్తూ, పోలీసులు దాబా యజమానితో కుమ్మక్కయ్యారని ఆరోపణలు గుప్పించారు.

 

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన దరఖాస్తుపల్లి గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే పరిస్థితి అదుపుతప్పి, ఆగ్రహంతో ఊగిపోయిన దాడికోరులు పోలీస్ స్టేషన్‌పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దాడిలో స్టేషన్‌లోని కిటికీ అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనుమానాస్పద మృతిపై సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఆధారాలు తుడిచేసే యత్నం చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన చేపట్టడంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అలుముకుంది.