ఎవ్వరు అయినా సరే ఇంటిలోకి ఎలుకలు వస్తే, చాలా వరకు వాటిని తరిమికట్టడానికే ప్రయత్నిస్తారు. కానీ రాజస్థాన్లో ఉన్న ఒక ఆలయంలో ఎలుకలకు రాజమర్యాదలు చేస్తారు. అంతే కాకుండా వాటిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇంతకీ ఈ ఆలయం ఏంటి అనుకుంటున్నారా? రాజస్థాన్ సమీపంలోని బికనీర్ దగ్గరలో ఉన్న దేశ్ నోక్లో కొలువై ఉన్న కర్ణిమాత ఆలయం. ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది చాలా ప్రత్యేకమైన విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి.
అంతే కాకుండా ప్రపచంవ్యాప్తంగా ఎలుకల ఆలయంగా ఇది చాలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అయితే ఇక్కడ చాలా వరకు ఒకటో రెండో ఎలుకలు ఉంటాయి అనుకుంటారు. కానీ ఈ ఆలయంలో ఏకంగా 25000ల ఎలుకలు ఉంటాయంట. ఇక మీరు ఆలయంలోనికి వెళ్లాలి అంటే తప్పకుండా వాటిని దాటుకొనే వెళ్లాలంట. అంతే కాదండోయ్, మీరు వెళ్లే సమయంలో మీ కాలికిందకు ఒక ఎలుక వచ్చి చనిపోతే, మీరు దానికి బదులు బంగారం సమర్పించాలంట. అందుకే ప్రతి సంవత్సరం, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది ఈ ఆలయాన్ని చాలా మంది సందర్శిస్తారు.
భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక ఈ ఆలయం. కొన్ని కథనాల ప్రకారం.. పద్నాలుగో శతాబ్ధంలో ప్రజా సంక్షేమానికి, కొన్ని మంచి కార్యాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప సాధువు కర్ణిమాత. అయితే ఈమె భక్తులలో ఒకరి బిడ్డ చనిపోయినప్పుడు, ఆమె తనను బతికించడానికి చాలా ప్రయత్నాలు చేసింది కానీ, అవి విఫలం అయ్యాయి. దీంతో ఆమె మృత్యుదేవుడైన యమరాజును వేడుకుంది. అప్పుడు యముడు తన భక్తులు అందరూ కూడా మరుజన్మలో కర్ణిమాత ఆలయంలో ఎలుకలుగా నివసిస్తారనే షరతు పెట్టి, ప్రాణదానం చేశాడు. అప్పటి నుంచి అక్కడ వేలాది ఎలుకలు ఆ ఆలయంలో నివసిస్తున్నాయంట.
దాదాపు ఈ ఆలయంలో 25000లకు పైగా ఎలుకలు నివసిస్తుంటాయి. భక్తులు ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ప్రతి చోట ఎలుకలు కనిపిస్తాయంట. అయితే పొరపాటున ఏదైనా ఎలుక, భక్తుల కాళ్ల మధ్య నలిగి మరణిస్తే, అది ఎవరి వలన మరణం పొందిందో, వారు, బంగారు ఎలకను, దాని పరిమాణంలోనే తయారు చేసి, గుడిలో దానం చేయాలంట. ఇలా చేయడం చాలా మంచిదంట.
అంతే కాకుండా ఈ కర్ణిమాత ఆలయంలో ఎలుకలను కాబా అని పిలుస్తారంట. ఇక అక్కడికి వెళ్లే భక్తులు, ఆలయ పూజారులు, ఎలుకల కోసం ధాన్యాలు, పాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ ఆలయంలో ఎలుకలు కాలిపై నుంచి వెళ్లడం లేదా, వాటిని చూడటం చాలా శుభప్రదం అంటారు. ముఖ్యంగా కర్ణిమాత ఆలయంలో ఉండే తెలుపు రంగు ఎలకను చూడటం వలన మనసులోని కోరికలు నెరవేరుతాయని అక్కడి వారు నమ్ముతారు.




